తెలంగాణ అనుభవమే చంద్రబాబుకు పాఠం!

గత ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వాటి అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.;

Update: 2025-08-11 13:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకుంటున్నారా? రాజకీయ, పాలనా రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు వేరేవారి నుంచి ఏమైనా తెలుసుకుంటారా? అంటే ఓ విషయంలో ఆయన పక్క రాష్ట్రం అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని సరికొత్తగా ప్రయాణిస్తున్నారని అంటున్నారు. దేశంలో సీనియర్ నాయకుడైన చంద్రబాబు నుంచి ఎవరైనా, ఏదైనా తెలుసుకోవాలని కోరుకుంటారు. కానీ, చంద్రబాబు మాత్రం తెలంగాణ నుంచి నేర్చుకోవడమేంటి? అన్న ప్రశ్నకు ఆగస్టు 15 నుంచి ప్రవేశపెట్టబోతున్న స్త్రీశక్తి పథకం సమాధానం కాబోతోందని అంటున్నారు.

గత ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వాటి అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో తల్లికి వందనం పథకం అమలు చేయగా, అంతకుముందు ఉగాదికి దీపం-2 పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇక తాజాగా అన్నదాతా సుఖీభవ కింద రైతుల అకౌంట్లలో నగదు జమ చేశారు. ఈ విధంగా మూడు హామీలను నెరవేర్చిన చంద్రబాబు ఈ నెల 15 నుంచి నాలుగో హామీగా స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ పథకం కింద ఏడాదికి దాదాపు రెండు వేల కోట్లు వెచ్చించనున్నారు.

మిగతా సంక్షేమ పథకాలతో పోల్చితే తక్కువ ఖర్చు, ఎక్కువ ప్రచారం వచ్చే ఉచిత ప్రయాణ పథకాన్ని ఇంత ఆలస్యంగా అమలు చేయడం వెనుక చంద్రబాబు వ్యూహాలు ఉన్నాయని చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హడావుడిగా ఆరంభంగా ఈ పథకాన్ని అమలు చేసి అబాసు పాలుకావడం కన్నా, కాస్త సమయం తీసుకున్నా, ఎలాంటి సమస్యలు లేకుండా అమలు చేయాలని భావించడమే ఆలస్యానికి కారణంగా విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఇంతకు ముందు కర్ణాటక, తెలంగాణల్లో అమలు చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాలకన్నా ముందుగా తమిళనాడు, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత ప్రయాణాన్ని అనుమతించినా, అవి కేవలం చెన్నై, ఢిల్లీ మెట్రో నగరాలకే పరిమితం చేయడంతో పెద్దగా సమస్యలు ఎదురుకాలేదు. కానీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవను అందుబాటులోకి తేవడం తీవ్ర విమర్శలకు, ఎన్నో వివాదాలు, గలాటాలకు కారణమైంది. దీంతో ఈ పథకం ద్వారా మంచి పేరుకన్నా, ఆయా రాష్ట్రప్రభుత్వాలు అప్రతిష్టనే మూటగట్టుకున్నాయన్న ప్రచారం ఉంది.

ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఉచిత బస్సు పథకంలో ఎదురైన అనుభవాలను పాఠంగా తీసుకున్న చంద్రబాబు ఏపీలో ఆ ఇబ్బందులు ఎదురుకాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారని అంటున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే ఉచిత బస్సు అందుబాటులోకి తెచ్చారు. ఆ సమయంలో ముందస్తు సన్నాహాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆటోడ్రైవర్ల దగ్గర నుంచి ఉచిత ప్రయాణం ద్వారా లబ్ధిపొందిన మహిళా ప్రయాణికులు వరకు అంతా నిరసన గళం వినిపించేవారు. ఏడాదిన్నర తర్వాత ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చినా తొలినాళ్లలో ఏర్పడిన దురాభిప్రాయం ఇప్పటికీ తొలగిపోలేదు.

దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పథకం అమలు చేస్తే ఆర్టీసీ బస్సుల్లో ఏ మేర రద్దీ పెరుగుతుందనే అంచనా వేయడంతోపాటు అందుకు తగ్గ ఏర్పాట్లు అన్నీ చేశాకే అమలు చేయాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. అదనపు సిబ్బందిని సమకూర్చుకోవడం, కొత్త సర్వీసులను అందుబాటులోకి తేవడం, ప్రయాణికుల మధ్య వివాదాలు లేకుండా, ప్రయాణికుల భద్రతకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా బస్సుల్లో కెమెరాలు అమర్చడంతోపాటు కండక్లర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు సమకూర్చాలన్న నిర్ణయం కూడా విశేషంగా చెబుతున్నారు.

కర్ణాటక, తెలంగాణల్లో ఉచిత పథకం అమలు చేసిన తొలినాళ్లలో రద్దీని సరిగా అంచనా వేయలేకపోవడం, ప్రయాణికుల భద్రతను విస్మరించడం, అదనపు సర్వీసులు లేకపోవడంతోనే ఇబ్బందులు ఎదురైనట్లు చెబుతున్నారు. ఈ సమస్యలను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవానికి తోడుగా తెలంగాణ పాఠాలను కూడా దృష్టిలో పెట్టుకుని ‘స్త్రీశక్తి’ పథకాన్ని పకడ్బందీగా, వివాదాలు, సమస్యలకు ఆస్కారం లేకుండా అమలు చేయాలని భావిస్తున్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News