వైసీపీకి మ‌హిళ‌ల సెగ‌.. టీడీపీ కొత్త పాచిక‌.. !

ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న రాజకీయం వేరు. ఇక నుంచి జ‌ర‌గ‌నున్న రాజ‌కీయం వేరు. తాజాగా టీడీపీ కొత్త వ్యూహంతో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించింది.

Update: 2026-08-17 14:47 GMT

ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న రాజకీయం వేరు. ఇక నుంచి జ‌ర‌గ‌నున్న రాజ‌కీయం వేరు. తాజాగా టీడీపీ కొత్త వ్యూహంతో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే సిద్ధ‌మ‌వుతున్న ఆ పార్టీ.. ఇప్ప‌టివ‌ర‌కు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై ప్ర‌ధానంగా ఆధార‌ప‌డింది. భ‌విష్య‌త్తులోనూ వారి ప్రాధాన్యం అలానే ఉండ‌నుంది. అయితే.. రాజ‌కీయంగా మాత్ర‌మే టీడీపీ కొత్త పాచిక‌ను రెడీ చేస్తోంది. అదే.. మ‌హిళ‌లు!. ప్ర‌ధాన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా ఉన్న వైసీపీని ఎదుర్కొనేందుకు ఈ పాచిక దోహ‌ద‌ప‌డుతుంద‌న్న భావ‌న ఉంది.

తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న‌ను బ‌ట్టి చూస్తే.. మ‌హిళ‌ల‌తో త్వ‌ర‌లోనే సంఘాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. దీనికి పార్టీల‌తో సంబంధం లేదు. వీరిలో ఎవ‌రైనా ఏ వ‌య‌సు వారైనా ఉండొచ్చు. గ్రామాలు, మండలాలు, న‌గ‌రాలు ఇలా అన్ని ప్రాంతాల్లోనూ మ‌హిళ‌ల‌కు రాజ‌కీయ పార్టీల‌కు అతీతంగా సంఘాల‌ను ఏర్పాటు చేస్తారు. వీరు.. స్థానికంగా ఉన్న రాజ‌కీయ నేత‌ల ప‌నితీరును తెలుసుకుంటారు. వారి ప‌నితీరు స‌హా.. వారి వ్య‌వ‌హారాలు.. మ‌న‌స్త‌త్వం.. ఇలా అన్ని కోణాల్లోనూ అధ్య‌య‌నం చేస్తారు.

వీరు తెలుసుకున్న విష‌యాల‌ను ఒక్కొక్క‌రు ఇద్ద‌రికి చేర‌వేస్తారు. ఇలా.. ఒక గొలుసు క‌ట్టు వ్యూహాన్ని చంద్ర‌బాబు ప్ర‌తిపాదించారు. త‌ద్వారా.. మ‌హిళ‌లు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ స‌హా మాజీ ప్ర‌జాప్ర‌తినిధుల తీరుతెన్నుల‌ను అంచ‌నా వేస్తారు. వాటిని పొరుగు మ‌హిళ‌లు, బంధువులు ఇలా.. అన్ని వ‌ర్గాల‌కు చేరువ అయ్యేలా.. చ‌ర్చిస్తారు. దీనిలో ఎక్క‌డా ప్ర‌చారం ఉండ‌దు. కేవ‌లం మౌత్ ప‌బ్లిసిటీత‌ర‌హాలో వైసీపీ నాయ‌కుల ప‌నితీరుపై ముఖ్యంగా దృష్టి పెట్ట‌నున్నారు.

ఇది ఒక‌ర‌కంగా.. అన‌ధికార వ్యూహంలో భాగ‌మ‌నే చెప్పాలి. అనంత‌రం.. ఎన్నిక‌ల స‌మ‌యానికి మ‌హిళ‌ల‌కు స‌ద‌రు నేత‌ల‌పై ఒక ద్రుఢ అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుంది. దీంతో ఎవ‌రిని గెలిపించాలి? ఎవ‌రిని ఓడించాల‌న్న విష‌యం పై నిర్ణ‌యం తీసుకుంటారు. త‌ద్వారా వైసీపీకి ప‌రోక్షంగా, ప్ర‌త్యక్షంగా కూడా చెక్ పెట్టాల‌న్న‌ది చంద్ర‌బాబు వ్యూహం. దీనిలో పురుషుల ప్ర‌మేయం కూడా ఉండ‌దు. పైగా.. రానున్న ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల ఓటు బ్యాంకు కీల‌కంగా మారిన నేప‌థ్యంలో మ‌హిళల ద్వారానే.. ఈ ప‌నిని చేయాల‌ని నిర్ణ‌యించ‌డం.. రాష్ట్రంలో సంచ‌ల‌న రాజ‌కీయాల‌కు తెర‌దీసే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News