టీడీపీలో ఆ 'నలుగురు'పై చర్చ... వారు వీరేనా?

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే.;

Update: 2025-06-30 04:25 GMT
టీడీపీలో ఆ నలుగురుపై చర్చ... వారు వీరేనా?

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ ఛార్జులు, పరిశీలకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కాస్త సీరియస్ అయ్యారు.

ఇందులో భాగంగా... ఈ కార్యక్రమానికి 56 మంది గైర్హాజరవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విస్తృత సమావేశాలకే రానివారు.. ఇక తమ నియోజకవర్గాలకు ఏం చేస్తారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకునేవారు ఇక అక్కడే ఉండడం మంచిదంటూ చంద్రబాబు చురకలేశారు. ఒకింత ఘాటు హెచ్చరికలు చేశారు.

ఇందులో భాగంగా... ఉదయం ఈ విస్తృత స్థాయి సమావేశానికి ఎంతమంది వచ్చారు? మొక్కుబడిగా సంతకాలు పెట్టేసి ఎంతమంది వెళ్లిపోయారు? చివరివరకు ఎంతమంది ఉన్నారు? అనే వివరాలు తన దగ్గర ఉన్నాయని చెప్పిన చంద్రబాబు... తానా, ఆటా సమావేశాలకు వెళ్లేందుకు టికెట్లు బుక్‌ చేసుకున్న వారి వివరాలూ తమవద్ద ఉన్నాయని చెప్పారు.

ఈ సందర్భంగా... ఇంటింటి ప్రచారం నేపథ్యంలో మంత్రులను సమీక్షల నుంచి మినహాయిస్తున్నామని చెప్పిన సీఎం... ఎట్టిపరిస్థితుల్లోనూ నెలరోజులూ నియోజకవర్గంలోనే ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... కొంతమంది ఎమ్మెల్యేలు ఉదాసీనంగా ఉంటున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరికొంతమంది ఎమ్మెల్యేలు సీరియస్‌ గా పనిచేయట్లేదని.. ఇవన్నీ ప్రజలు గమనిస్తారని గుర్తుంచుకోవాలని.. తానిచ్చే సూచనలతో పనితీరు మార్చుకుంటే మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తారని.. లేదంటే మీ ఇష్టంమని.. ఇక మొహమాటం ఉండదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా... ఎమ్మెల్యేలతో శనివారం నుంచి ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నాని ప్రకటించారు.

ఈ క్రమంలో రోజుకు నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నానని పేర్కొన్న సీఎం... ఎమ్మెల్యేలకు తాను చెప్పాల్సింది చెబుతున్నానని, పనితీరు మారాలని తేల్చి చెప్పారు. అలా చెప్పినట్లుగా పనితీరు మార్చుకుంటే బాగుంటుందని.. అలా కాని పక్షంలో ఇక అంతే సంగతులని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమయంలో ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ బలంగా మొదలైంది.

అవును... గత కొంతకాలంలో ఎమ్మెల్యేల పనీతీరుపై కాస్త అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు తాజాగా నలుగురు ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడినట్లు చెప్పడంతో.. వారు ఎవరనే చర్చ పార్టీలో విపరీతంగా మొదలైంది. ఆ నలుగురు ఎవరు? వారిని ఎప్పుడు పిలిచారు? ఏమి మాట్లాడారు? అని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆరాతీయడం మొదలుపెట్టారంట.

ఈ సమయంలో... శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషతో సీఎం మాట్లాడినట్లు చెబుతున్నారు! దీంతో వారినుంచి వివరాలు తెలుసుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో... తర్వాత విడతలో చంద్రబాబు నుంచి ఎవరికి పిలుపు వస్తుంది? ఇప్పటికే ఎవరికైనా ఫోన్లు వచ్చాయా? ఫస్ట్ నలుగురిని అడిగిన ప్రశ్నలే తమనూ అడుగుతారా? లేక, కొత్త ప్రశ్నలు ఉంటాయా? అంటూ ఇంటర్వ్యూకు వెళ్లే ముందు అభ్యర్థులు పడినంత టెన్షన్ పడుతున్నారంట టీడీపీ ఎమ్మెల్యేలు!

Tags:    

Similar News