చిన్నమ్మ కోసం చంద్రబాబు చక్రం తిప్పుతారా ..!
పరస్పర వైరుధ్యంగా రాజకీయాలు చేసుకున్నారు. కానీ, గత కొన్నాళ్లుగా ఈ రెండు కుటుంబాలు కలిసిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.;
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. అలానే.. చంద్రబాబు కుటుంబాని కి.. దగ్గుబాటి కుటుంబానికి మధ్య రాజకీయ వైరుధ్యాలు ఒకప్పుడు ఉన్నా.. ఇప్పుడు దాదాపు సమసిపోయా యన్న భావన అయితే ఉంది. ఒకప్పుడు ఆ ఇంటిపై కాకి.. ఈ ఇంటిపై వాలని విధంగా రాజకీయాలు చేసుకున్నారు. పరస్పర వైరుధ్యంగా రాజకీయాలు చేసుకున్నారు. కానీ, గత కొన్నాళ్లుగా ఈ రెండు కుటుంబాలు కలిసిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షురాలు రేసులో ఉన్నారని భావిస్తున్న రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విషయంలో చంద్రబాబు చక్రం తిప్పుతారా? అనే చర్చ తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం కూటమి పార్టీల్లోనూ చర్చగా మారింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగాఉన్న జేపీ నడ్డా .. ఈ నెల ఆఖరులో ఆ పదవిని వదులుకోనున్నారు. ప్రస్తుతం దేశంలోని 19 రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మారుస్తోంది. వీరి ఎంపిక పూర్తయిన దరిమిలా వెంటనే జాతీయ నాయకత్వంపై దృష్టి పెట్టనుంది.
ఈ దఫా దక్షిణాది నుంచి జాతీయ అధ్యక్ష పదవికి నాయకులను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఉత్తరాదిలో ఓటు బ్యాంకు తగ్గుతున్న నేపథ్యంలో బీజేపీ దక్షిణాదిపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. పైగా.. దక్షిణాదిలోనూ ఎక్కువ మంది మిత్రులు ఉన్నారు. ఈ క్రమంలోనే దక్షిణాదికి చెందిన వారిని పార్టీ చీఫ్‌లుగా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, వానతి శ్రీనివాసన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.
ఈ ముగ్గురిలో ఎక్కువగా అవకాశం దగ్గుబాటికే ఉందన్న చర్చ కూడా ఉంది. దీనికి కారణం.. కూటమిలో మిత్ర పక్షంగా ఉన్న టీడీపీ అధినేత చక్రం తిప్పే అవకాశంఉందని సమాచారం. వాస్తవానికి బీజేపీ వ్యవహారమే అయినా.. చంద్రబాబు చెబితే.. కేంద్రంలోని వారు కూడా వింటారన్న వాదన ఉంది. గతంలోనూ రెండు మూడు సార్లుఇలానే జరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిన్నమ్మకు కూడా.. చంద్రబాబు చక్రం తిప్పే అవకాశం లేకపోలేదని.. కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఆమెకు కూడా బీజేపీలో మంచి పలుకుబడి ఉండడం.. ఏపీలో కూటమి కట్టడంలోనూ.. అధికారంలోకి తీసుకురావడంలోనూ కీలకం గా వ్యవహరించిన నేపథ్యంలో బీజేపీ సంతృప్తిగానే ఉంది. సో.. ఈ పరిణామాలన్నీ కలిసి వచ్చి.. పురందేశ్వరికి పగ్గాలు అప్పగించే అవకాశం లేకపోలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.