టీడీపీ డోర్స్ తెరచుకున్నాయ్... ఇక ప్రకంపనలేనా ?

రాజకీయాల్లో ఎపుడూ వ్యూహాలదే ముఖ్య పాత్రగా ఉంటుంది సరైన వ్యూహం రచించాలి. అది కూడా సందర్భానుసారం వాడాలి.;

Update: 2025-09-20 04:01 GMT

రాజకీయాల్లో ఎపుడూ వ్యూహాలదే ముఖ్య పాత్రగా ఉంటుంది సరైన వ్యూహం రచించాలి. అది కూడా సందర్భానుసారం వాడాలి. లేకపోతే కరెక్ట్ రిజల్ట్ ని ఇవ్వదు. ఆ విషయంలో టీడీపీ ఏనాడో పండిపోయింది. నాలుగున్నర దశాబ్దాల పార్టీకి అర్ధ శతాబ్దం అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నారు. దాంతో ఆయనకు ఎప్పటికి ఏది సబబో అది చేయడం బాగా తెలుసు అంటారు. ఇపుడు ఆయన తన అపర చాణక్యానికి పదును పెట్టారని దాంతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు చోటు చేసుకుంటాయా అన్నది చర్చగా ఉంది.

నో అంటూనే వచ్చి :

తెలుగుదేశానికి ఈ రోజున ఎక్కడ లేని బలం ఉంది. ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి నాయకులు కనీసం నలుగురైదుగురు ఉన్నారు. ఇక మరో యాభై అసెంబ్లీ సీట్లు పెంచినా కూడా టీడీపీ తమ్ముళ్లకు సర్దుకోవడానికి సరిపోదు. అంతలా కిక్కిరిసిపోయిన పార్టీలోకి వేరే వారిని తీసుకుని రావడం ఎందుకు అన్నది ఇన్నాళ్ళూ ఆలోచించారని చెబుతారు పైగా కొత్తగా తీసుకుంటే వర్గ పోరు మరింతగా పెరుగుతుందని అది అవాంచనీయ ధోరణులకు కారణం అవుతుందని కూడా భావిస్తూ నో చెబుతూ వచ్చారు.

వైసీపీ వీక్ గా ఉన్న వేళ :

ఇంకో వైపు చూస్తే వైసీపీ వీక్ గా ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా వ్యూహాల లేమితో చతికిలపడి ఉంది. ఆ పార్టీ 2024 ఎన్నికల షాక్ నుంచి ఇంకా తేరుకోలేని స్థితిలోనే ఉంది అని అంటున్నారు. ఇక పార్టీలో కూడా స్తబ్దత ఆవరించి ఉంది. ప్రతీ జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో అనేక మంది నాయకులు దారులు లేక సతమతమవుతున్నారని అంటున్నారు. చేరడానికి పార్టీలు లేవని ఉక్కబోత ఉన్నా ఫ్యాన్ నీడన గడుపుతున్న వారు సైతం ఉన్నారని అంటున్నారు. అయితే ఇపుడు అలాంటి వారికి ఒక బలమైన సంకేతాన్ని టీడీపీ ఏరి కోరి పంపించింది అని అంటున్నారు.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే :

తాజాగా వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలను టీడీపీ చేర్చుకుంది. వారి మెడలో పసుపు కండువా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి చేరిపోయారు. ఈ ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్సీలు, అయితే వీరు రాజీనామా చేసి చాలా కాలం అయింది. అయినా వారి రాజీనామాలను ఆమోదించలేదు. దాంతో విసిగిన వీరంతా టీడీపీ కండువా కప్పుకున్నారు. దీని మీద మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ మేము వైసీపీకి మా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశాం, అయినా ఆమోదించలేదు, దాంతో సోమవారం మండలికి వెళ్ళి అక్కడే తేల్చుకుంటామని అన్నారు. మమ్మల్ని డిస్ క్వాలిఫై చేసినా రాజీనామా ఆమోదించినా ఓకే అని ఆయన చెప్పేశారు. మిగిలిన ఎమ్మెల్సీలు అదే విధంగా మాట్లాడుతూ బాబు పాలన సూపర్ అని అందుకే టీడీపీలో చేరామని చెప్పారు.

మరింత మంది రెడీనా :

తెలుగుదేశం పార్టీలో ముగ్గురు ఎమ్మెల్సీలు చేరడంతో ఏపీ రాజకీయాల్లో కదలిక వచ్చింది అని అంటున్నారు. వైసీపీలోని చాలా మంది నేతలలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయని అంటున్నారు. అనేక మంది కూటమి వైపుగా మొగ్గుతున్నారు. అయితే వారిని ఇంతకాలం ఆపారు. అయితే స్థానిక ఎన్నికలు రానున్న రోజులలో ఉండడంతో పాటు వైసీపీని గట్టిగా దెబ్బ తీయాలని పక్కా వ్యూహం ఉండడంతో సైకిలెక్కే వారికి ఆహ్వానం పలుకుతారు అని అంటున్నారు. అందులో ఎమ్మెల్యేలు కూడా ఉండొచ్చు అని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. అలాగే బిగ్ షాట్స్ సీనియర్లు కూడా ఉంటే వారిని చేర్చుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే మాత్రం ఏపీలో పెను రాజకీయ ప్రకంపనలకు తెర లేచినట్లే అని అంటున్నారు.

Tags:    

Similar News