సంతృప్తి లెక్కల్లో చంద్రబాబు.. ఈ లోపాల మాటేంటి .. !
రాష్ట్ర ప్రజల సంతృప్తిపై చంద్రబాబు మరోసారి సర్వే నిర్వహించారు.;

రాష్ట్ర ప్రజల సంతృప్తిపై చంద్రబాబు మరోసారి సర్వే నిర్వహించారు. ఐవిఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా తీసుకున్న సర్వే నివేదికలను తాజాగా ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలకు చెప్పుకొచ్చారు. దాదాపు అన్ని విషయాల్లోనూ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని 85 నుంచి 90 శాతం మధ్య సంతృప్తి కనిపిస్తోందని ఆయన వెల్లడించారు. ఇది మంచిదే. ఏ ప్రభుత్వమైనా తన పాలనకు సంబంధించి మార్కులు వేసుకోవడం ప్రజలకు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవడం ద్వారా మరింత మెరుగైన పాలన అందించేందుకు, మరింత మెరుగైన విధానాలను తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుంది.
అయితే చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయోగాలు ఏకపక్షంగా ఉన్నాయనే మాట పరిశీలకుల మధ్య వినిపిస్తోంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 శాతం మందికి కూడా అందడం లేదు. కానీ తాజా సర్వేలో ఆరోగ్యశ్రీపై ఏకంగా 92 శాతం మంది సంతృప్తితో ఉన్నారని చంద్రబాబు చెప్పారు. అదే విధంగా ఇతర సంక్షేమ పథకాలు విషయాన్ని తీసుకుంటే అందరూ ఆనందంగా ఉన్నారని 80 శాతం మంది సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇది క్షేత్రస్థాయిలో చూసుకుంటే సరైనది కాదనేది సొంత పార్టీలోనూ వినిపిస్తున్న మాట.
ఎందుకంటే సాధారణంగా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ పరంగా చూసుకున్నప్పుడు చంద్రబాబు కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాస్తవాన్ని విస్మరిస్తున్నారని మాట వినిపిస్తోంది. ఉదాహరణకు ఏ పని కావాలన్నా రాష్ట్రస్థాయిలో చేతులు తడపందే పనులు కావడం లేదని సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు అభిమానులు సానుభూతిపరులు కూడా బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. కానీ కాజా సర్వేలో మాత్రం 85 శాతం మంది అసలు అవినీతి లేదని చెప్పారని సర్వే చేసి చెప్పినట్టు చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఇక ఆసుపత్రుల్లో నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉందని నాలుగు రోజుల కిందట టిడిపిని బలపరిచే ఒక ప్రధాన పత్రిక ఆధారాలతో సహా బయటపెట్టింది. కానీ తాజా సర్వేలో 80 శాతం మంది ఆసుపత్రులలో నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని తేల్చి చెప్పినట్టు చంద్రబాబు ప్రకటించారు. ఇక, నగరాలు పట్టణాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో లేరని వారు సొంత కార్యక్రమాల్లో తిరుగుతున్నారని గత వారం రోజులుగా కూడా పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.
తాజాగా కూడా ఒక వైద్యురాలు ఆసుపత్రుల్లోనే నిద్రపోవడం, ఆ సమయంలో పేషంట్లకు వైద్యం అందకపోవడంతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన రాష్ట్రంలో చోటుచేసుకుంది. అయినా దీనిపై సంతృప్తి 90 శాతం ఉందని సర్వే చెప్పినట్టు చంద్రబాబు తేల్చి చెప్పేశారు. ఇక ఇసుక విషయానికి వస్తే ఇది సాధారణ ప్రజలకు అందుబాటులో లేదనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఇసుకపై ఏకంగా 79 శాతం మంది సంతోషంగా ఉన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అదేవిధంగా రేషన్ పంపిణీ వాహనాలు నిలిపివేయడంపై 90 శాతం మంది దీపం 2 పథకంపై ప్రజలు 98 శాతం మంది సంతోషంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు.
వాస్తవానికి ఈ రెండు కూడా చాలా తప్పు అనేది క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న మాట. రేషన్ డోర్ డెలివరీ లేని కారణంగా పంచాయతీలు అదేవిధంగా నగరపాలక సంస్థలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇళ్లకు వాళ్ళు మోసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ సర్వే రిపోర్ట్ లలో ఆర్టీసీ విషయానికి కూడా చంద్రబాబు మంచి మార్కులు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఏకంగా ఆర్టిసి సౌలభ్యం పై 90 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.
కానీ ప్రైవేటు రంగాన్ని ఆర్టిసి డామినేట్ చేయలేకపోతుండడం ప్రధానంగా చర్చనీయాంశం. ఇప్పటికీ పల్లెల్లో అటు పట్నాల్లో కూడా ఆర్టీసీ సేవలు పెద్ద ఆశించినంత స్థాయిలో అయితే లేవనేది వాస్తవం. అన్ని విషయాల్లోనూ సర్వే రిపోర్ట్ లు ఒకరకంగా క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం మరోరకంగా ఉండడం ఆలోచించాల్సిన విషయం.