రాజ్యసభ ఆశావాహులు.. ఏపీలో 4 స్థానాల కోసం పోటాపోటీ
సరిగ్గా నెల వ్యవధిలో ఏపీలోని రాజ్యసభ స్థానాల్లో నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో.. ఏపీలోని కూటమి సర్కారులో రాజ్యసభలో చోటు దక్కించుకోవటం కోసం పోటీ పెరిగింది.
సరిగ్గా నెల వ్యవధిలో ఏపీలోని రాజ్యసభ స్థానాల్లో నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో.. ఏపీలోని కూటమి సర్కారులో రాజ్యసభలో చోటు దక్కించుకోవటం కోసం పోటీ పెరిగింది. అందుకు తగ్గట్లే.. ఎవరికి వారు తమ ప్రయత్నాలు షురూ చేశారు. నాలుగు పోస్టులకు భారీగా ఆశావాహుల సంఖ్య ఉండటంతో తుదకు ఆ స్థానాల్ని దక్కించుకునే వారెవరు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాలనుంచి అందుతున్న సమాచారం ప్రకారం కూటమి ప్రభుత్వంలో టీడీపీ.. జనసేన.. బీజేపీల్లో ఏ పార్టీకి ఎన్నిసీట్లు? అన్నది ప్రశ్నగా మారింది. ఇందుకు సమాధానంగా తెలుగుదేశం పార్టీకి రెండు స్థానాలు.. మిత్రపక్షాలైన జనసేన.. బీజేపీలకు ఒక్కో స్థానం చొప్పున కేటాయిస్తారన్న మాట బలంగా వినిపిస్తోంది. నిజానికి బీజేపీకి ఉన్న అసెంబ్లీ స్థానాల పరంగా చూస్తే.. ఒక స్థానాన్ని కేటాయించటం ఎక్కువే అయినప్పటికి.. కేంద్రంలోని ఎన్డీయే భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో.. బీజేపీకి ఒక స్థానం ఇవ్వక తప్పని పరిస్థితి.
ఇదిలా ఉండగా మరోవాదన కూడా వినిపిస్తోంది. 2025లో విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి ఇచ్చిన నేపథ్యంలో.. తాజాగా ఖాళీగా ఉన్న నాలుగు స్థానాల్లో మూడు తెలుగుదేశం.. ఒకటి జనసేనకు కేటాయించేలా సర్దుబాటు జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. రాజ్యసభలో తమ పార్టీ సంఖ్యా బలంపై బీజేపీ అధినాయకత్వం ప్రత్యేక ఆసక్తి ఉన్న నేపథ్యంలో.. తాజా నాలుగు స్థానాల్లో ఒక్కటి కూడా తమకు కేటాయించని ప్రపోజల్ కు కమలనాథులు ఓకే అంటారా? అన్నది కూడా ప్రశ్నే. ఒకవేళ.. తమకు స్థానం కేటాయించకున్నా ఫర్లేదన్న మాట బీజేపీ అధినాయకత్వం నుంచి వస్తే మాత్రం.. అదో గొప్ప విషయం అవుతుందన్న మాట వినిపిస్తోంది.
ఖాళీగా ఉన్న నాలుగు స్థానాల్లో కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీల్లో ఎవరికెన్ని స్థానాలన్న విషయంపై క్లారిటీ ఒక ఎత్తు అయితే.. ఆయా స్థానాల్ని సొంతం చేసుకోవటానికి ఆయా పార్టీలకు చెందిన నేతలు.. మద్దతుదారులు.. బడాబాబులు భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ బీజేపీకి ఒక స్థానాన్ని కేటాయించిన పక్షంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాధవ్ కు అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. అలా కాని పక్షంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి దక్కే వీలుందని చెబుతున్నారు. బీజేపీ సంగతి ఇలా ఉంటే.. జనసేన పార్టీ విషయానికి వస్తే.. ఆ పార్టీకి కేటాయించే ఒక స్థానానికి తీవ్రమైన పోటీ ఉన్నట్లుగా చెప్పాలి.
జనసేన నుంచి రాజ్యసభ స్థానానికి పోటీ పడుతున్న వారిలో ముందంజలో ఉన్నది మాత్రం లింగమనేని రమేశ్ గా చెబుతున్నారు. ఒకవేళ ఆయనకు అవకాశం లభిస్తే.. ఆ ప్రభావం తెలుగుదేశం మీద తప్పనిసరిగా ఉంటుందని చెబుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. లింగమనేనికి అవకాశం ఇస్తే.. ఆయన సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఆశావాహులకు గండిపడినట్లేనని చెప్పక తప్పదు. ఒక సామాజిక వర్గానికి చెందిన వారిలో ఒకరికి మాత్రమే అవకాశం దక్కుతుంది. అందుకే.. జనసేన డిసైడ్ చేసే వారికి అనుగుణంగా తెలుగుదేశం ఆశావాహుల అవకాశాలు మారతాయని చెప్పక తప్పదు. జనసేనకు సంబంధించి పలువురు రాజ్యసభ స్థానం మీద ఆశలు పెట్టుకున్నప్పటికి.. ఈసారికి మాత్రం లింగమనేనికి అధిక అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే.. పార్టీ కోసం ఎంతో కాలంగా పని చేస్తూ.. లోకేశ్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా చెప్పే కిలారు రాజేశ్ రాజ్యసభలో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్పాలి. భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామక్రిష్ణ.. గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్.. మాజీ రాజ్యసభ సభ్యులు కంభంపాటి రామ్మోహన్ రావు లాంటి వారి పేర్లు ఆశావాహుల రేసులో ఉన్నాయి. అయితే.. వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో.. వీరిలో ఒకరికి మాత్రమే అవకాశం దక్కుతుందని చెప్పక తప్పదు. అదే సమయంలో జనసేన నుంచి లింగమనేనికి చోటు లభిస్తే.. ఈ నలుగురికి నిరాశ ఖాయం.
టీడీపీ నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యతో పాటు ఐటీడీపీ ఇన్ చార్జి స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్ బీసీ కోటాలో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి చంద్రబాబు అవకాశం ఇస్తారా? అన్నది సందేహమే. సామాజిక వర్గాలు.. ప్రాంతాల సమతూకాన్ని పాటించాల్సిన పరిస్థితుల్లో కోస్తాకు చెందిన నేతకు ఒక స్థానాన్ని కేటాయిస్తే.. ఉత్తరాంధ్ర కంటే రాయలసీమకు చెందిన నేతకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి రాజ్యసభ రేసులో ఉన్నారు. ఓవైపు రాజ్యసభ ఖాళీలు.. మరోవైపు కేంద్రమంత్రి వర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో పలువురు ఆశావాహులు సీఎం చంద్రబాబును కలిసేందుకు క్యూ కడుతున్నారు. మరి.. రాజ్యసభ అభ్యర్థులుగా చంద్రబాబు ఎవరికి అవకాశం ఇస్తారన్నదిప్పుడు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.