బాబు 'ఏఐ'ని వదిలేలాలేరు!

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దూసుకుపోతోన్న వేళ.. స్కూలు పిల్లల నుంచి డ్వాక్రా మహిళల వరకూ ఏఐ ని పరిచయం చేయాలని బాబు సూచించారు.;

Update: 2025-04-25 04:48 GMT

టెక్నాలజీ విషయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారనే సంగతి తెలిసిందే. 1996లో తొలిసారిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఐటీ గురించి ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు అని చెబుతారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దూసుకుపోతోన్న వేళ.. స్కూలు పిల్లల నుంచి డ్వాక్రా మహిళల వరకూ ఏఐ ని పరిచయం చేయాలని బాబు సూచించారు.

అవును... ‘ఏఐ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’ అనే అంశంపై సచివాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న వర్క్ షాప్ ను గురువారం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా... పాలనలో టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా వేగవంతంగా సేవలను అందించాలని నిర్దేశించారు. ఈ విషయంలో ఏఐకి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పిన సీఎం చంద్రబాబు.. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఏఐ ఆధారిత వస్తువుల వినియోగంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే ఐటీ రంగంలో ఉన్నవారికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు ఏఐలో శిక్షణ ఇప్పించేలా చూడాలన్నారు.

ఇదే క్రమంలో... వ్యవసాయ పనుల్లో పాల్గొనే మహిళలకు ఏఐ ద్వారా డ్రోన్లను వినియోగించే శిక్షణ ఇవ్వడం ద్వారా మరింత మెరుగైన ఉత్పత్తులను సాధించేందుకు అవకాశం ఉంటుందని.. ఏఐ టెక్నాలజీ సాయంతో పంటలకు మందులు పిచికారీతోపాటు తెగుళ్లను గుర్తించే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిపారు.

ప్రధానంగా రాష్ట్రంలో భారీ డేటా లేక్ ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టినట్లు చెప్పిన చంద్రబాబు... ఏఐ యూనివర్శిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు. 30 ఏళ్ల కిందట తాను చేసిన ప్రయత్నంతోనే నేడు రాష్ట్రం సంకేతికంగా ముందుదని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తొలి ఐటీ కార్యదర్శి, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ... దేశంలోనే తొలిసారి ఐటీ గురించి 1996లో మాట్లాడింది సీఎం చంద్రబాబు ఒక్కరేనని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలనాపరమైన వివిధ రకాల ఏఐ టెక్నాలజీలను రాష్ట్ర ఐటీ కార్యదర్శి భాస్కర్ వివరించారు.

Tags:    

Similar News