బాబు పవన్ లోకేష్ కలసికట్టుగా అక్కడికి !

విశాఖ ఒక అతి పెద్ద కీలకమైన జాతీయ సదస్సుకు వేదికగా నిలిచింది. 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు విశాఖలో ఈ నెల 22 నుంచి రెండు రోజుల పాటు జరుగుతోంది.;

Update: 2025-09-22 04:02 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ముగ్గురూ ఒకే వేదిక మీద కనిపించబోతున్నారా. అది కూడా అమరావతి దాటి మరో చోట ఆ ముచ్చట జరగనుందా అంటే అవును అనే చెప్పాలి. ఈ త్రిమూర్తులు విశాఖ వేదిక మీద కనిపించబోతున్నారు. నెల కూడా కాకుండా విశాఖలో ఈ నాయక త్రయం కలసికట్టుగా రావడం విశేషంగానే అంతా చూస్తున్నారు. విశాఖలో వరసబెట్టి జరుగుతున్న అనేక కార్యక్రమాలలో ఈ ముగ్గురు నేతలు విడివిడిగా పాల్గొంటూనే ఉన్నారు. చంద్రబాబు అయితే నెల రోజుల వ్యవధిలో అనేక సార్లు విశాఖ వచ్చారు. ఈ నెల 17న ఆయన విశాఖలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కలసి మూడు అధికార కార్యక్రమాలలో పాల్గొన్నారు మళ్ళీ ఇపుడు మరోసారి భారీ అధికారిక కార్యక్రమానికి వస్తున్నారు.

జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సుకి వేదిక :

విశాఖ ఒక అతి పెద్ద కీలకమైన జాతీయ సదస్సుకు వేదికగా నిలిచింది. 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు విశాఖలో ఈ నెల 22 నుంచి రెండు రోజుల పాటు జరుగుతోంది. ఈ సదస్సుకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ మంత్రి నారా లోకేష్ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ హాజరవుతున్నారు. ఇక ఎలక్ట్రానిక్స్ , సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ అన్న అంశం మీద ఈ ఏడాది సదస్సును నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ లో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలి జెన్స్ సైబర్‌ సెక్యూరిటీ, పౌర సేవలు, అగ్రి-స్టాక్ వంటి అంశాలపై ఈ జాతీయ సదస్సులో చర్చించనున్నారు.

పెరుగుతున్న ప్రాముఖ్యత :

జాతీయ సదస్సులకు వేదికగా విశాఖ అవుతోంది. కేంద్ర ప్రభుత్వంతో ఏపీలో కూటమి భాగస్వామిగా ఉండడంతో అనేక ముఖ్యమైన సదస్సులను ఏపీలో నిర్వహిస్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ కూడా కారణం అవుతోంది. ఈ జాతీయ సదస్సులో ఈ గవర్నెన్స్ అవార్డులు కూడా ప్రదానం చేస్తారు. అలాగే ఈ గవర్నెన్స్‌లో ఉత్తమ ఆవిష్కరణలు, సముద్ర గర్భ కేబుల్స్, డేటా సెంటర్లు, గ్రామీణ స్థాయిలో ఈ-గవర్నెన్స్ ఆవిష్కరణలు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఈ గవర్నెన్స్ కార్య క్రమాలు, సైబర్‌ సెక్యూరిటీ వంటి అంశాలపై లోతైన చర్చలు జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News