జగన్ ధ్వంసం చేశాడు.. ఆదుకోండి: చంద్రబాబు
ఈ క్రమంలో ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసి.. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, అభివృద్ధి, ప్రాజెక్టులు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తున్నారు.;
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసి.. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, అభివృద్ధి, ప్రాజెక్టులు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని గత పాలకుడు(జగన్) నాశనం చేశారని.. ఇప్పుడు దానిని సరిదిద్దు తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా సరిగా వినియోగించుకోలేదన్నారు. దీంతో రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయాయని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక 78 కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నామని వివరించారు.
ఆయా కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లను కూడా కేటాయించి.. అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో తమను ఇతోధికంగా ఆదుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రధానంగా సాస్కి(రాష్ట్రాల రాజధాని ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక సాయం), పూర్వోదయ పథకాల తరహాలో రాష్ట్రానికి నిధులు కేటాయించాలని నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు కోరారు. సిస్కో పథకం కింద రూ.2,010 కోట్లు లభించాయని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మూలధన ప్రాజెక్టుల కోసం అదనంగా రూ.5 వేల కోట్లు కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు.
అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగిల్ నోడల్ ఏజెన్సీ ప్రోత్సా హక పథకం మార్గదర్శకాల ప్రకారం రూ.250 కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్రాభివృద్ధి కోసం(పూర్వోదయ) కేంద్రం ప్రకటించిన పథకాన్ని స్వాగతిస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం పొందగలదని తెలిపారు. దీని విధివిధానాలు రూపొందించి త్వరగా ఈ పథకాన్ని అమల్లో తేవాలని ముఖ్యమంత్రి కోరారు.
అనంతరం.. చంద్రబాబు ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియాతో కూడా భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సంఘం కేటాయించే నిధుల్లో వెసులుబాటు కల్పించాలని ఆయనను కోరారు. ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి దశలోనే ఉందని.. ప్రజలకు చేయాల్సింది చాలా ఉందని వివరించారు. ముఖ్యంగా అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు అవసరమని కూడా చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఏపీకిసాధ్యమైనంత ఎక్కువగా నిధులు కేటాయించాలని విన్నవించారు.