మిలాఖత్ రాజకీయం: ఎవరిదారి వారిదే.. !
కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి చెందిన మాజీ నాయకులతో చేతులు కలిపి పలు వ్యాపారాలు చేస్తున్నట్టు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి.;
అధికార టిడిపిలో మీలాఖత్ రాజకీయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి చెందిన మాజీ నాయకులతో చేతులు కలిపి పలు వ్యాపారాలు చేస్తున్నట్టు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్లాంటి రాజకీయాలను సహించేది లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు ప్రస్తుతం తెరమీదకు వచ్చిన అనేక అంశాలను ఆయన ప్రస్తావిస్తూ భవిష్యత్తులో ఇట్లాంటి రాజకీయాలు చేసే వారిని పక్కన పెడతానని కూడా హెచ్చరించారు.
ఈ పరిణామం టిడిపిలో తీవ్ర చర్చనీయాంసంగా మారింది. అలాగని చంద్రబాబు చెప్తున్నట్టుగా ఇప్పటికి ఇప్పుడు వైసీపీ నాయకులను వదిలేసే పరిస్థితి కనిపించడం లేదు. ఉదాహరణకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో వైసిపి మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మద్యం వ్యాపారం చేస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి తెలియకుండా చక్రం తిప్పుతున్నారని వార్తలు వచ్చాయి. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రైస్ మిల్లింగ్ వ్యాపారంలో కూడా వైసీపీకి చెందిన మాజీ మంత్రులు నేతలతో నాయకులు మిలాఖత్ అయ్యారని ప్రభుత్వానికి సమాచారం చేరింది.
అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా వైసీపీ మాజీ మంత్రితో కలిసి కొందరు టిడిపి ఎమ్మెల్యేలు వ్యాపారం చేస్తున్నారని సమాచారం. ఇక ఉత్తరాంధ్రలోనూ ఇటువంటి రాజకీయాలకు కొదవ లేకుండా పోయింది. మొత్తంగా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు చెబుతున్న దానికి భిన్నంగా కొందరు నాయకులు అడుగులు వేస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో వివాదాలు వచ్చినప్పుడు మాత్రమే నాయకుల పేర్లు బయటకు వస్తున్నాయి. మిగిలిన చోట్ల సర్దుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది.
ఇటీవల విశాఖపట్నంలో ఓ కీలక కంపెనీకి భూములు సేకరించే అంశం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసిపి నేత సహాయం తీసుకుని రైతులను ఒప్పించిన వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే ఇది మంచి పరిణామం కాబట్టి ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే తర్వాత కాలంలో ఏ మాజీ మంత్రితో చేతులు కలిపి భూములు ఇప్పించారో అదే మాజీ మంత్రితో కలిసి ఇసుక వ్యాపారంలో సదరు టిడిపి నాయకులు పనిచేస్తున్నారని తెలిసి పార్టీ అధిష్టానం విస్మయానికి గురైంది. దీంతో అటు ఎవరిని ఏమీ అనలేక ఇటు సమర్ధించుకోలేక క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులపై పార్టీ అంతర్మథనం చెందుతోంది. ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందనేది చూడాలి.