చంద్రబాబు సహనం.. ఏపీకి మంచిదే ..!
రెండు కీలక విషయాల్లో కొర్రీలు పెడుతున్న తెలంగాణ ప్రభుత్వం వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు చాలా సంయమనం పాటిస్తున్నారన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.;
రెండు కీలక విషయాల్లో కొర్రీలు పెడుతున్న తెలంగాణ ప్రభుత్వం వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు చాలా సంయమనం పాటిస్తున్నారన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ సహనాన్ని కొందరు తెలంగాణ వాదులు.. వేరే రూపంలో అర్థం చేసుకుంటున్నారని కూడా చెబుతున్నారు. కానీ.. ఇలాంటి ఆలోచనలు సరికావని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితిని కాచి వడబోసిన చంద్రబాబుకు.. ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసునని.. అందుకే ఆయన సహనం వహిస్తున్నారని చెబుతున్నారు.
1) జలాల సమస్య: ఈ సమస్య తెలంగాణ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉంది. అప్పట్లోనే పోలవరాన్ని అడ్డుకుంటూ.. తెలంగాణ వాదులు ప్రకటనలు గుప్పించారు. ఇప్పటికీ బీఆర్ఎస్ మాజీ నాయకురాలు కవిత దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగులో ఉండడం గమనార్హం. అయినప్పటికీ.. చంద్రబాబు సహనంతోనే ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ విషయంలోనూ ఆయన చెబుతున్నది మంచిదేనన్న అభిప్రాయం ఉంది.
వృథాగా పోతున్న గోదావరి జలాలను ఒడిసి పట్టుకుని ఏపీ, తెలంగాణకు కూడా మేలు జరిగేలా వినియోగించుకుందామన్న చంద్రబాబు దూరదృష్టితో కూడిన ఆలోచనను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోందన్నది కీలకం. పైగా.. దీని వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం వాటిల్లదన్న నిపుణుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. అయినప్పటికీ.. సహనంతోనే సమస్యలను పరిష్కరించుకు నేందుకు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు.
2) రేవంత్ వ్యవహారం: మంచో చెడో తెలియదు కానీ... రేవంత్ వల్ల చంద్రబాబు రెండు సార్లు ఇరుకున పడ్డారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో ముందు వెనుక ఆలోచన లేకుండానే.. రేవంత్ రెడ్డి సొమ్ములు ఇస్తూ.. వీడియో కెమెరాలకు చిక్కారు. దీనివల్ల చంద్రబాబు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పోలవరం-బనకచర్ల వ్యవహారంలోనూ ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు.. నాలుగు గోడల మధ్య జరిగిన సంగతులను బయట పెట్టడం ఎంత వరకు సబబు అనేది కీలక ప్రశ్న. ఏదైనా ఉంటే.. అదే నాలుగు గోడల మధ్య తేల్చుకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.