అదిరేలా `మహానాడు`.. 19 కమిటీల ఏర్పాటు!
ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు కడపలో నిర్వహించే టీడీపీ పసుపు పండుగ మహానాడును అదిరేలా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు;
ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు కడపలో నిర్వహించే టీడీపీ పసుపు పండుగ మహానాడును అదిరేలా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వాస్తవానికి టీడీపీ మహానాడును నిర్వమించడం కొత్తకాదు. కానీ, ఈ దఫా.. రెండు ప్రత్యేకతలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు దీనిని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఐదేళ్లలో అనేక సమస్యలు ఎదుర్కొని కూటమి కట్టి సర్కారు ఏర్పాటు చేయడం ఒకటైతే.. చంద్రబాబుకు వయసు రీత్యా 75 ఏళ్లు రావడం మరో కారణం. దీంతో మహానాడును చాలా ఘనంగా.. ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో తాజాగా మహానాడు నిర్వహణకు 19 కమిటీలను నియమించారు. అయితే.. వాస్తవానికి ప్రతిసారీ మహానాడుకు ఆరేడు మహా అయితే.. 10 కమిటీలనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ సారి మాత్రం 19 కమిటీలను ఏర్పాటు చేశారు. దీనికి కూడా ప్రధాన కారణాలు ఉన్నాయి. 1) ఈ దఫా 5 లక్షల మంది వరకు కార్యకర్తలను సమీకరిస్తుండడం. 2) మహానాడుకు తొలిసారి కడప వేదిక కావడం. 3) మహానాడులో కీలక నిర్ణయాలు తీసుకోవడం. 4) మహానాడులోనే కాదు.. దీని నిర్వహణలోనూ ఎక్కువ మంది నాయకులకు భాగస్వామ్యం కల్పించడం.. అనే కీలక అంశాల ఆధారంగా 19 కమిటీలను ఏర్పాటు చేశారు. ఆయా కమిటీలు.. మహానాడును ఘనంగా నిర్వహించడంతోపాటు వచ్చిన అతిథులను, ఆహ్వానితులను సగౌరవంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఏ చిన్న అపశ్రుతి కూడా దొర్లకుండా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఇవీ.. కమిటీలు!
1) ఆహ్వాన కమిటీ: పార్టీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు నేతృత్వం వహిస్తారు.
2) సమన్వయ కమిటీ: మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఉంటుంది.
3) తీర్మానాల కమిటీ: మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వం వహిస్తారు.
4) వసతుల కమిటీ: మంత్రి అచ్చెన్నాయుడు చూసుకుంటారు.
5) సభ నిర్వహణ కమిటీ: కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నేతృత్వం వహిస్తారు.
6) స్వచ్ఛ మహానాడు కమిటీ: మంత్రి వాసంశెట్టి సుభాష్ చూసుకుంటారు.
7) జనసమీకరణ కమిటీ: మంత్రి గొట్టి పాటి నేతృత్వం వహిస్తారు.
8) రవాణా కమిటీ: మంత్రి నారాయణ చూస్తారు.
9) ప్రతినిధుల నమోదు కమిటీ: చింతకాయల విజయ్ (స్పీకర్ అయ్యన్న తనయుడు)
10) వలంటీర్ల నిర్వహణ కమిటీ: మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వం వహిస్తారు.
11) అలంకరణ కమిటీ: పులవర్తి నానీ నేతృత్వంలో ఏర్పాటు
12) వాహనాల పార్కింగ్ కమిటీ: మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు చూస్తారు.
13) సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చూస్తారు.
14) మీడియా కమిటీ: మంత్రి ఫరూక్ నేతృత్వం వహిస్తారు.
15) ప్రాంగణ పర్యవేక్షణ కమిటీ: మంత్రి నిమ్మల రామానాయుడు చూస్తారు.
16) మెడికల్ క్యాంపు కమిటీ: మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చూస్తారు.
17) భోజనాల ఏర్పాట్ల కమిటీ: మంత్రి బీసీ జనార్దన్ నేతృత్వం వహిస్తారు(ఇది కీలకమైంది).
18) ఎగ్జిబిషన్ కమిటీ: మంత్రి ఆనంరామనారాయణరెడ్డి చూస్తారు.
19) ఆర్థిక వనరుల కమిటీ: మంత్రి అనగాని సత్య ప్రసాద్ నేతృత్వం వహిస్తారు.