తమిళ తంబీలు ఫిదా.. "అనైవరుక్కుం వణక్కం" అంటూ చంద్రబాబు ప్రసంగం!
రెండు రోజుల ఎన్నికల ప్రచారం కోసం చంద్రబాబు తమిళనాడులోని ముఖ్యనగరాల్లో పర్యటిస్తున్నారు.;
ఎన్నికల ప్రచారం కోసం తమిళనాడులో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు అక్కడి ఓటర్లను ఆకట్టుకునేలా మాట్లాడుతున్నారు. ప్రధానంగా బహిరంగ సభల్లో తమిళంలో మాట్లాడుతూ ఓటర్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. తమిళనాడు సరిహద్దుల్లోని చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబుకు కొద్దికొద్దిగా తమిళం తెలుసునని అంటున్నారు. దీంతో తన ప్రసంగం మధ్యలో కొన్ని తమిళ పదాలను వాడుతూ ఓటర్లతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
రెండు రోజుల ఎన్నికల ప్రచారం కోసం చంద్రబాబు తమిళనాడులోని ముఖ్యనగరాల్లో పర్యటిస్తున్నారు. సోమవారం కోయంబత్తూరులో అడుపెట్టిన సీఎం.. వరుస కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇక సోమవారం చంద్రబాబు పుట్టిన రోజు కూడా, దీంతో ఓటర్లను ఆకట్టుకునేలా తన ఈ పుట్టన రోజు నాడు తమిళనాడు రావడం సంతోషంగా ఉందని చెప్పేందుకు చంద్రబాబు తమిళ భాషను వాడుకున్నారు. ‘‘అనైవరుక్కుం వణక్కం.. (అందరికీ నమస్కారం) ఎన్ అన్బాన తమిళ్ నాడు మక్కళే..’’ (నా పుట్టిన రోజున తమిళనాడులో ఉన్నాను) అంటూ చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు.
అదేవిధంగా మున్నేట్రం వేణ్దుమా.. వేలైవాయుప్ప గళ్ వేణ్డుమా.. అంటూ అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల అంశాలను ప్రస్తావించారు. అప్పడియానాల్ మధ్యతిల్ మోదీజీ ఇరుక్క వేణ్డుం.. మానిలతిల్ అమ్మ ఆట్చి వర వేణ్డుం.. ఇదుక్కు ఎన్డీఏ కూట్టణియై వెట్రి పెర చేయ్యుంగల్’’ అంటూ కేంద్రంలో ఎన్డీఏ కూటమి తరఫున ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం అవసరమని, రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాలనను గుర్తు చేస్తూ అన్నాడీఎంకే అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు కోరారు.
ఇక తన ప్రసంగంలో ఆయన తమిళనాడు అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, యువతకు ఉపాధి అవకాశాలపై ఎక్కువగా మాట్లాడారు. దక్షిణాదిలో అభివృద్ధి వేగవంతం కావాలంటే కేంద్ర, రాష్ట్రాల సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. గతంలో కూడా తమిళనాడులో ప్రచారం చేసినప్పటికీ చంద్రబాబు ఇప్పటిలా తమిళంలో పెద్దగా ప్రసంగించలేదని అంటున్నారు. స్థానిక సంస్కృతి, భాష పట్ల గౌరవాన్ని చూపుతూ మాట్లాడటం వల్ల సభకు వచ్చిన ప్రజల్లో సానుకూల స్పందన కలిగిందని అంటున్నారు.