స్టాలిన్ ని ఢీ కొడుతున్న బాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీయేలో అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉన్నారు అన్నది తెలిసిందే.;
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీయేలో అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉన్నారు అన్నది తెలిసిందే. ఎన్డీయేలో బీజేపీ 240 సీట్లతో తొలి స్థానంలో ఉంటే 16 మంది ఎంపీలతో టీడీపీ రెండో పెద్ద పార్టీగా ఉంది. దానికి తగినట్లే ఎన్డీయేలో టీడీపీకి బాబుకు విశేష ప్రాధాన్యత రాజకీయంగా లభిస్తోంది. ఇదిలా ఉంటే దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీయే విజయం కోసం మిత్ర పార్టీలు అన్నీ మద్దతుగా నిలిచి ప్రచారంలోకి దిగిపోయాయి. ఇక ఏపీకి పక్కనే ఉన్న తమిళనాడు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఎన్ డీయే అభ్యర్ధుల తరఫున ప్రచారానికి సిద్ధపడుతున్నారు.
తమిళ సీమలో ప్రచారం :
తమిళనాడు అంటే ఒకనాడు ఏపీతో కలసి ఉన్న రాష్ట్రమే. అంతే కాదు తెలుగు మాట్లాడే ప్రాంతాలు కూడా ఇక్కడ అధికంగా ఉన్నాయి. దాంతో బాబు ఎన్డీయే కూటమి తరఫున ప్రచారానికి రంగంలోకి దిగిపోతున్నారు. ఈ మేరకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులోని కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, ఆవడి, మధురైలలో ఎన్డీఏ పక్షాల అభ్యర్థుల తరపున బాబు ప్రచారం నిర్వహించనున్నారని తెలుస్తోంది.
కోయంబత్తూరు నుంచే :
ఇక ఈ నెల 20న ఉదయం అమరావతి నుంచి కోయంబత్తూరు బయల్దేరి వెళ్లనున్న చంద్రబాబు మధ్యాహ్నం ఒంటి గంటకు కోయంబత్తూరులో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఆ విధంగా తొలి సభతో బాబు ఎన్నికల ప్రచారం మొదలై రెండు రోజుల పాటు ఉధృతంగా సాగుతుంది అని అంటున్నారు. కోయంబత్తూరు నుంచి హోసూరు నుంచి తళ్లి చేరుకుని బాబు అదే రోజు సాయంత్రం అక్కడ జరిగే ప్రచార ర్యాలీకి హాజరవుతారు. ఇక 20వ తేదీ రాత్రికి చెన్నై చేరుకుని ఆవడిలో జరుగనున్న రోడ్ షోలో పాల్గొని ఎన్డీఏ అభ్యర్ధుల తరపున ప్రచారం చేయనున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక చెన్నైలోనే బాబు రాత్రికి బస చేస్తారు. ఆ మరుసటి రోజు అంటే 21వ తేదీ ఉదయం చెన్నై నుంచి బయలుదేరి మధురైకి బాబు చేరుకుంటారు. మధురై సమీపంలోని సాత్తూర్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు వివిధ సామాజిక వర్గాల నేతలతో సమావేశం ఆయన నిర్వహించనున్నారు. అనంతరం మూడు గంటలకు సాత్తూర్ లోనే ఎన్డీఏ అభ్యర్ధి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం మధురై నుంచి నేరుగా హైదరాబాద్ కు చేరుకుంటారు.
పాత మిత్రునితో ఢీ :
ఇదిలా ఉంటే స్టాలిన్ చంద్రబాబు పాత మిత్రులు. కరుణా నిధి కాలం నుంచి డీఎంకే టీడీపీల మధ్య మంచి స్నేహం ఉంది. ఎన్నో సార్లు కలసి పనిచేశారు. జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలు భుజం కలిపి ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించాయి. అయితే బాబు ఇపుడు ఎన్డీయేలో ఉన్నారు. దాంతో స్టాలిన్ ప్రత్యర్థిగానే భావించి ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. తమిళనాడులో త్రిముఖ పోరు సాగుతోంది. ఎన్డీయేలో అన్నా డీఎంకే బీజేపీ ఇతర పార్టీలు ఉన్నాయి. ఒక విధంగా బీజేపీ తమిళనాడుని ప్రతిష్టగా భావిస్తోంది. దాంతో బాబుతో ప్రచారం చేయిస్తోంది అని అంటున్నారు తమిళనాడులో కూడా బాబుకు ఆదరణ ఉంది కాబట్టి అది ఓట్ల రూపంలో మారుతుందని బీజేపీ పెద్దలు విశ్వసిస్తున్నారు. ఇక తమిళనాడులో బాబు ఏమి మాట్లాడుతారు, స్టాలిన్ మీద ఏ రకమైన విమర్శలు చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.