చంద్రబాబు మరో భారీ పథకం.. జనాభా పెరుగుదలకు సరికొత్త వ్యూహం!

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరాపల్లిలో శనివారం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు.

Update: 2026-05-16 17:50 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో భారీ పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. జనాభా సంక్షోభాన్ని అధిగమించేందుకు గత కొద్ది నెలలుగా జనాభా మేనేజ్మెంట్ కోసం మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు తాజాగా కీలక ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ప్రస్తుత సమాజంలో అధికంగా పిల్లలను కనాలని దంపతులను ప్రోత్సహించేలా ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. పిల్లలను ఎక్కువగా కనడం అంటే భారంగా భావించే తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తూ మూడో బిడ్డను కంటే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు చొప్పున తక్షణ సాయం అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరాపల్లిలో శనివారం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పిల్లలే సంపద అంటూ సరికొత్త భాష్యం చెప్పారు. నేటి పరిస్థితుల్లో పిల్లలు భారంగా భావిస్తున్నారు. చాలా మంది ఒకరు లేదా ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తులో ఎదురవ్వబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండాలంటే కొత్తగా పెళ్లి చేసుకునేవారు ఎక్కువ మంది పిల్లలను కనడంపై దృష్టి పెట్టాలి. పిల్లలు భారంగా భావించొద్దు. ఇందుకోసం మీకు భరోసాగా నిలవాలని నేను ఆలోచిస్తున్నా.. త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటానని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

అంతేకాకుండా తన మనసులో ఆలోచనను బయటపెట్టారు. ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు నగదు బహుమతులను అందజేస్తామని వెల్లడించారు. ముగ్గురు పిల్లలను కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు చొప్పున ప్రసవం అయిన వెంటనే అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సీఎం ఈ ప్రకటన చేయగానే సభికులు కూడా చప్పట్లతో భారీ స్థాయిలో ప్రతిస్పందించారు. ఆ సమయంలో సీఎం కూడా ముసిముసి నవ్వులతో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ జనాభా నియంత్రణకు బదులుగా జనాభా పెరుగుదల ఆవశ్యకతను వివరిస్తూ త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని స్పష్టం చేశారు.

తల్లికివందనం పెంపు

ఇక ఇదే సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వరం ప్రకటించారు. తన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికివందనం పథకం కింద ఇస్తున్న నగదును పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తల్లికివందనం పథకంలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. అయితే ఇందులో పాఠశాలల నిర్వహణ కోసం రూ.2 వేల చొప్పున కోత విధిస్తూ విద్యార్థుల తల్లి ఖాతాకు రూ.13 వేలు మాత్రమే జమ చేస్తున్నారు. తాజాగా సీఎం చెప్పిన మాటల ప్రకారం ఈ డబ్బు రూ.15 వేలు పూర్తిగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వచ్చేనెల 19న తల్లికివందనం నిధులు విడుదల చేయనుండగా, సీఎం ప్రకటన తల్లిదండ్రుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఒకపక్క ప్రభుత్వం చెబుతూ, భారీగా నిధులు అవసరమయ్యే రెండు పథకాలను చంద్రబాబు ప్రకటించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News