ఏణ్ణర్ధం బాబు పాలన...జనాల రియాక్షన్ !
చంద్రబాబు ఏడున్నర పదుల వయసులో ముఖ్యమంత్రిగా నాలుగవ సారి బాధ్యతలు చేపట్టారు.;
ఏపీలో ఎంతో అనుభవం కలిగిన ముఖ్యమంత్రిగా నాలుగవసారి పీఠాన్ని అధిరోహించారు చంద్రబాబు. ఆయన పేరు చెబితే జనాలలో రెండే అభిప్రాయాలు కలుగుతాయి. ఒకటి నమ్మకం, రెండు అనుభవం. ఈ విషయంలో ఆయనను అధిగమించే నేత అయితే ఏపీ పాలిటిక్స్ లో లేరు అని అంటారు. ఇక బాబుకు నాలుగవ సారి అధికారం 2024 జూన్ 4న దక్కింది. ప్రజలు మూకుమ్మడిగా బాబు నాయకత్వంలోని టీడీపీ కూటమికి పట్టం కట్టారు. ఈ నేపధ్యంలో గత పదిహేడు నెలలుగా బాబు ఏపీని ముందుకు నడిపిస్తున్నారు. కూటమి పాలన మరో నెల అంటే ఈ డిసెంబర్ 12 నాటికి ఏణ్ణర్థం పూర్తి చేసుకోబోతోంది. దాదాపుగా అక్కడికి చేరువ అయినట్లే. మరి ఈ కీలక సమయంలో బాబు పాలన ఎలా ఉంది, జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఆసక్తికరమైన అంశాలే ఎన్నో ఇందులో వినిపిస్తాయి.
ఏడున్నర పదుల వయసులో :
చంద్రబాబు ఏడున్నర పదుల వయసులో ముఖ్యమంత్రిగా నాలుగవ సారి బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో ఏపీ ఒక దశ దిశ లేకుండా ఉంది. అమరావతి ఆగిపోయింది. పోలవరం కదలడం లేదు, ఏపీ అప్పుల్లో ఉంది. ఎటు చూసినా ఇబ్బందులు ఆర్ధిక సంక్షోభం ఇలాంటి నేపధ్యంలో బాబు అయితేనే ఒడ్డున పడేస్తారు అన్న నమ్మకంతో ఆయన అనుభవానికి జనాలు జై కొట్టారు. ఎన్నో సవాళ్ళ మధ్య సీఎం గా బాధ్యతలు చేపట్టిన బాబు ఏ మేరకు విజయవంతం అయ్యారు అంటే దానికి జనాల నుంచి బాగానే సానుకూల స్పందన లభిస్తోంది అని అంటున్నారు.
ఆ ఫీలింగ్ ఎక్కువ :
ఏపీని బాబు ఒక గాడిన పెడుతున్నారు అన్న ఫీలింగ్ ఎక్కువ మందిలో ఉంది అని అంటున్నారు ఏపీ అన్నది విభజిత రాష్ట్రం, పైగా ఎన్నో అప్పులు భారాలు ఉన్నాయి. అయితే అదే సమయంలో ఆశా కిరణాలు అయితే కనిపిస్తున్నాయని అంటున్నారు. పెట్టుబడులను తీసుకుని రావడం నుంచి కొత్త ఒప్పందాలు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉండేలా చూసుకోవడం అన్నది అన్నీ చూస్తున్న వారు ఏపీ సాధ్యమైనంత తొందరలో కోలుకుని మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరో టెర్మ్ కోసం :
ఇక కూటమి ప్రభుత్వ పెద్దలు అయితే మరో పది నుంచి పదిహేనేళ్ళ పాటు ఏపీలో కూటమి ప్రభుత్వమే ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. ఎందుకు అలా అంటే ప్రస్తుతం సాగుతున్న అభివృద్ధి అంతా ఒక కొలిక్కి రావాలని అనుకున్నా లేక రానున్న రోజులకు సంబంధించి ప్రభుత్వం రచించిన ప్రణాళికలు కార్యరూపం దాల్చాలి అన్నా ఈ ప్రగతి ఫలాలు అందరికీ అందాలన్నా కూడా మరింత సమయం పడుతుందని కూడా చెబుతున్నారు. ఒక్కటే ప్రభుత్వం ఒకే పాలన ఉంటే కనుక ఇవన్నీ సాకారం అవుతాయని అంటున్నారు. సరిగ్గా ఈ పాయింట్ మీదనే ఏపీ జనాలు కూడా అంగీకరిస్తున్నారు అని అంటున్నారు. అందువల్ల బాబు చెప్పినట్లుగా వైకుంఠ పాళి ఆడేందుకు ఈసారి పెద్దగా సిద్ధపడక పోవచ్చు అని కూడా అంటున్నారు.
వైసీపీ తప్పిదాలు :
మరో వైపు చూస్తే 2019లో వైసీపీకి అధికారం ఇస్తే వారు తాము చేయాల్సినవి చేయడం అన్నది పక్కన పెడితే ఏపీలో అంతవరకూ సాగిన అభివృద్ధిని కొనసాగించలేకపోయారు అన్న చర్చ ఉండనే ఉంది. అదే వైసీపీ కనుక గత ప్రభుత్వం అభివృద్ధిని కొనసాగించి ఉంటే ప్రజలు కూడా ఆలోచించేవారేమో అన్నది కూడా ఉంది. ఏది ఏమైనా ఈ పరిణామాలు కూడా ఏపీలో అభివృద్ధి కాముకులకు కూటమి బెస్ట్ అనిపించేలా చేస్తున్నాయని అంటున్నారు.
పెద్దగా లేవుగా :
మరో వైపు చూస్తే ఏణ్ణర్థం కాలంలో కూటమి ప్రభుత్వం మీద పెద్దగా విమర్శలు అయితే లేవు, ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా లేవు. రాజకీయ విమర్శలు అన్నవి సహజం. వాటి వల్ల జనాల మైండ్ సెట్ మారేది ఉండదని అంటున్నారు. ఇక కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ కలయిక కూడా జనాల్లో పాజిటివిటీని పెంచుతోంది అంటున్నారు. గతానికి భిన్నంగా కేంద్ర సాయం అందడం అలాగే జనసేన అధినేత పవన్ కూడా కూటమి పదిహేనేళ్ళు కొనసాగాలి అని చెప్పడం ద్వారా కూటమి ఐక్యతను బలంగా చాటుతున్నారు. ఈ నేపధ్యాన్ని చూసిన జనాలలో కూడా ఒక బలమైన ప్రభుత్వం ఏపీలో ఉంది అన్న భావన కలుగుతోంది అంటున్నారు. మొత్తానికి సంక్షేమం అభివృద్ధిని జోడించి ఈసారి చంద్రబాబు చేస్తున్న ప్రయోగం కూటమికి మరింత ఆయుస్షుని ఇచ్చెలాగానే ప్రస్తుతం వాతావరణం కనిపిస్తోంది అని అంటున్నారు.