"సీఎం సార్‌ను చూశాక.. ఇంటికి వెళ్లబుద్ధి కాలేదు!"
``సీఎం సార్ ను చూసిన తర్వాత.. ఇంటికి వెళ్లబుద్ధి కాలేదు.`` ఇది.. ఎవరో చిన్న చితకా ఉద్యోగో.. పార్టీ కార్యకర్తో..లేక మంత్రో చెప్పిన మాట కాదు;
``సీఎం సార్ ను చూసిన తర్వాత.. ఇంటికి వెళ్లబుద్ధి కాలేదు.`` ఇది.. ఎవరో చిన్న చితకా ఉద్యోగో.. పార్టీ కార్యకర్తో..లేక మంత్రో చెప్పిన మాట కాదు. విపత్తు నిర్వహణ విభాగంలో పనిచేస్తున్న ఉన్నతాధికారి చెప్పిన మాట. పేరు చెప్పేందుకు ఇష్టపడని ఆయన.. తుఫానులు, విపత్తుల సమయంలో మీడియాకు అత్యంత చేరువగా ఉంటారు. నిజానికి ఆయన ఏపీకి చెందిన అధికారి కూడా కాదు. ఉత్తరాది రాష్ట్రానికి చెందిన అధికారి. కానీ.. ఏపీ అంటే మనసు పెడతారు.
ముఖ్యంగా సీఎం చంద్రబాబు హయాంలో ఆయన పనితీరుకు మంచి మార్కులు పడ్డాయి. గతంలో హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు కూడా ఈయన దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. అలానే.. ఇప్పుడు కూడా మొంథా తుఫాను సమయంలో ఆయన అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబా బు కూడా పేర్కొన్నారు. ``ఆయన ఉన్నారు. అన్నీ ఆయన చూసుకుంటారు. ఇది మంచిదే.. కానీ.. మీరు కూడా అలెర్టుగా ఉండండి`` అని అధికారులకు సూచించారు.
అలా.. ఉన్నతస్థాయిలో ఉన్న అధికారి.. సోమవారం అర్ధరాత్రి తర్వాత కూడా ఆర్టీజీఎస్ కేంద్రంలోను.. విపత్తుల నిర్వహణ కేంద్రంలోనూ(రెండూ ఒకే భవనంలో ఉంటాయి) తిరిగారు తప్ప.. ఇంటి ముఖం పట్టలేదు. అప్పటి వరకు సీఎం చంద్రబాబు రాత్రి 11 గంటల సమయం దాకా తుఫానులపై సమీక్షించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కొంత రెస్టు తీసుకుని మళ్లీ వస్తానంటూ.. సీఎం చంద్రబాబు వెళ్లిపోయారు. అయితే.. మళ్లీ ఆయన ఎప్పుడు వచ్చేదీ చెప్పలేదు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏ సమయంలో అయినా.. పరిస్థితి తీవ్రత పెరుగుతుందన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు.. అర్ధరాత్రో.. తెల్లవారు జామునో ఆర్టీజీఎస్‌కు వచ్చే అవకాశం ఉందని భావించిన సదరు అధికారికి ఇంటికి కూడా వెళ్లలేదు. అంతేకాదు.. మీడియా కు కూడా ఈ విషయం చెప్పకుండా.. గోప్యంగా ఉంచారు. ఉదయం మీడియా ఆయనను పలకించి.. మీరు ఇంటికి వెళ్లలేదా? అని ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పుడు.. ``సీఎం సార్‌ను చూశాక.. ఇంటికి వెళ్లబుద్ధి కాలేదు!``అని ముక్తాయించారు. సో.. బాబు పనితీరును చూసి ఇన్‌స్పైర్ అయ్యే అధికారులు కూడా ఉంటారని తెలుస్తోంది.