ఎమ్మెల్యే డైరీ: ఈ డేట్లు ఫుల్ బిజీ.. !
ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఉన్న 164 మంది ఎమ్మెల్యేల్లో 134 మంది టీడీపీకి చెందిన వారే ఉన్నారు.;
ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఉన్న 164 మంది ఎమ్మెల్యేల్లో 134 మంది టీడీపీకి చెందిన వారే ఉన్నారు. వీరిలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లను పక్కన పెడితే.. మిగిలిన వారిలో కొందరు మంత్రులు ఉన్నారు. వీరి విషయం ఎలా ఉన్నా.. మిగిలిన 115 మందికి పైగా ఎమ్మెల్యేలు.. నిత్యం డైరీ రాసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమానికి హాజరు కావాలి.. ఏయే కార్యక్రమాల్లో వాయిస్ వినిపించాలని ఎమ్మెల్యేలు ముందుగానే అలెర్ట్ అవుతున్నారు.
ఈ విషయాలను వాస్తవానికి పీఏలు చూస్తారు. కానీ, గత నెల రోజుల నుంచి కూడా ఎమ్మెల్యేలే చూస్తున్నారు. ఇటీవల ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబుకు ఇదే విషయాన్ని కూడా చెప్పారు. మా డైరీలు మేమే రాసుకుంటున్నాం.. అని వివరించారు. దీనికి కారణం.. కీలకమైన రెండు రోజులు.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు టాస్క్ అప్పగించారు. ఆ రోజుల్లో ఖచ్చితంగా నియోజకవర్గాల్లో ఉండడంతో పాటు ప్రజలకు చేరువగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
''మీరు ఎక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలుసు. కనీసం 1వ తేదీ.. అలానే ప్రభుత్వం కీలక పథకాలను అమలు చేస్తున్న రోజుల్లో కూడా అందుబాటులో ఉండకపోతే.. ఎలా?'' అంటూ చంద్రబాబు క్లాస్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీని డైరీల్లో నాయకులు రౌండ్ చేసుకున్నారు. అంటే.. ఆ రోజు ఇతర పనులు ఏవీ పెట్టుకోరు. నేరుగా పింఛన్లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి గత నెలలోనే ఈ విషయంపై చంద్రబాబు చెప్పారు.
అయినప్పటికీ.. ఈ నెల 1న చాలా మంది ఎమ్మెల్యేలు కార్యక్రమాలకు డుమ్మా కొట్టారు. పింఛన్లు ఇచ్చే కార్యక్రమంలో వారు నేరుగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు చెప్పినా.. కొందరు హాజరు కాలేదు. ఈ నేపథ్యం లో పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. అంతేకాదు.. ఎవరు పాల్గొన్నారు.. ఎవరు పాల్గొనలేదు.. అనే సమాచారాన్ని కూడా సేకరించారు. ఇప్పుడు అలాంటి వారంతా అలెర్ట్ అయ్యారు. వారి వారి డైరీల్లోనే కాకుండా.. వాయిస్ మెసేజ్‌తో గుర్తు చేసే యాప్‌లను కూడా ఫోన్‌లలో డౌన్ లోడ్ చేసుకున్నారు. మొత్తానికి ఇప్పటికైనా ఎమ్మెల్యేలు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెడీ కావడం విశేషం.