రాజధానిగా అమరావతి చట్టసవరణ వేళ బాబు భారీ ప్లాన్

ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేయటమే కాదు.. దానికి శాశ్వితత్వాన్ని కట్టబెడుతూ పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టేందుకు సర్వం సిద్ధమైంది.;

Update: 2026-04-01 10:30 GMT

ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేయటమే కాదు.. దానికి శాశ్వితత్వాన్ని కట్టబెడుతూ పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టేందుకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఏపీలోని కూటమి సర్కారు ఇప్పటికే అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానాన్ని పంపిన సంగతి తెలిసిందే. విభజన చట్టంలో సవరణ చేస్తూ ప్రతిపాదిస్తున్న బిల్లు బుధవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు. దీని ఆమోదానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజధానిగా అమరావతిని డిసైడ్ చేస్తూ.. దాన్ని మళ్లీ మార్చేందుకు వీల్లేని విధంగా కేంద్రం చట్టాన్ని రూపొందించేందుకు కీలక చర్యలు చేపడుతున్నారు.

పార్లమెంటులో రాజధాని అమరావతి బిల్లును ప్రవేశ పెడుతున్న వేళలో ఏపీ వ్యాప్తంగా దానికి అనుకూలమైన వాతావరణం ఉందన్న విషయాన్ని తెలియజేసే అధికారపక్షం పక్కా ప్లాన్ చేసింది. జగన్ సర్కారు హయాంలో ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి స్థానంలో మూడు రాజధానుల కాన్సెప్టును తీసుకురావటం.. ఆ విషయంలో నెలకొన్న గందరగోళానికి తెర దించుతూ.. తమ వాదనను బలంగా వినిపించటమే కాదు..చట్టబద్ధతను తీసుకొచ్చేలా చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల ఆమోదం ఉందన్న విషయాన్ని చాటి చెప్పాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.

ఇందులో భాగంగా ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ రాజధాని అమరావతి బిల్లుకు అనుకూలంగా ప్రజలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేవారు. పార్లమెంటులో అమరావతి ఏపీ శాశ్విత రాజధాని బిల్లు ఆమోదానికి ముందే.. ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల మద్దతు ఉందన్న విషయాన్ని చాటి చెప్పాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా టీడీపీ నేతలకు ప్రత్యేక టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు.

బుధవారం రాష్ట్రస్థాయిలోనూ..జిల్లాలు.. మండలాల స్థాయిలోనూ రాజధాని అమరావతికి మద్దతుగా కూటమి పార్టీలు ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించేలా ప్లాన్ చేశాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా తాము తీసుకున్న నిర్ణయానికి పెద్ద ఎత్తున ప్రజామోదం ఉందన్న విషయాన్నిచాటి చెప్పాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. రాజధాని అమరావతి అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు.. ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం గమనార్హం.

Tags:    

Similar News