ఆన్‌లైన్‌లో రైలు టికెట్ బుక్ చేయగలరా?: మంత్రులకు చంద్రబాబు టెస్ట్!
రాష్ట్రంలో త్వరలోనే దాదాపు 1400 రకాల ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్ చేయనున్నారు. వాట్సాప్ సహా.. ఏఐ సాయంతో ప్రజల సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు నిర్ణయించారు.;
ఇదేంటి? అని అనుకుంటున్నారా? నిజమే. తన మంత్రి వర్గ సభ్యుల నెట్ సామర్థ్యాన్ని చంద్రబాబు పరిశీలించాలని భావించారు. తాజాగా గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చల అనంతరం.. చివరిలో కొందరు మంత్రులను ఆయన `ఉండండి` అని సూచించారు. వీరిని ఆయన ``మీరు ఐటీలో వెనుకబడుతున్నారు. మనది ఆర్టీజీఎస్ పాలన. మీకు ఆన్‌లైన్‌లో రైలు టికెట్ బుక్ చేయడం వచ్చా?`` అని ప్రశ్నించారు.
దీనికి సదరు మంత్రులు విస్మయం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు వచ్చని సమాధానం చెబితే.. మిగిలిన వారు మౌనంగా ఉన్నారు. దీంతో చంద్రబాబు స్పందిస్తూ.. ``ప్రస్తుతం మనం ఏఐలోకి వచ్చేశాం. కానీ.. మీకు వినియోగించడం రావడం లేదు. ఇలా అయితే.. ఇబ్బందులు వస్తాయి. రానివారు.. నేర్చుకోండి. తప్పేమీ కాదు. ప్రజల మద్యకువెళ్లే ముందే.. అన్నీ తెలిసి ఉండాలి. వారి వద్దకు వెళ్లిన తర్వాత.. తెలియకపోతే నవ్వుల పాలవుతాం.`` అని సూచించారు.
ఎందుకు?
రాష్ట్రంలో త్వరలోనే దాదాపు 1400 రకాల ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్ చేయనున్నారు. వాట్సాప్ సహా.. ఏఐ సాయంతో ప్రజల సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై వరుసగా అధికారులతో సమీక్షలు నిర్వహించారు. వారు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మంత్రులు ఐటీ సహా, ఏఐ వినియోగంలో వెనుకబడ్డారని చంద్రబాబు గుర్తించారు. దీంతో ఆయన వారికి కొన్ని సూచనలు చేశారు. ఏఐ వినియోగం ఎలా ఉన్నా.. ఆన్‌లైన్‌లో తర్ఫీదు పొందాలని ఏ అప్లికేషన్ను ఎలా పరిష్కరించాలన్న విషయంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ముఖ్యంగా వచ్చే రెండేళ్లలో పాలన మరింత వేగంగా సాగుతుందన్న ఆయన.. దీనికి సమర్ధవంతమైన నాలెడ్జ్ అవసరం అవుతుందన్నారు. అంతేకాదు.. మీరు వేరే వారిపై ఆధారపడకుండా.. ఆన్‌లైన్‌నే ఫైళ్లను పరిష్కరించడం.. సమస్యలు తెలుసూఉకోవడం వంటివి చేయాలని ఆయన సూచించారు. దీంతో మంత్రులు ఊపిరి పీల్చుకున్నారు. త్వరలోనే మంత్రులకు ఐటీ శిక్షణ ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు తెలిపారు.