ఈ నియోజకవర్గంలో ఓట్లేయలేదు కదా.. అన్నదాతలతో చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం జిల్లా పర్యటన విజయవంతమైంది. మార్కాపురం జిల్లా ఆవిర్భావం తర్వాత చంద్రబాబు తొలిసారిగా పర్యటించారు.;
ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం జిల్లా పర్యటన విజయవంతమైంది. మార్కాపురం జిల్లా ఆవిర్భావం తర్వాత చంద్రబాబు తొలిసారిగా పర్యటించారు. ఇందులో భాగంగా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల మండలం గంటవానిపల్లిలో రూ.456 కోట్లతో చేపట్టనున్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక రైతులు అమ్మిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సురవరం గండివీరారెడ్డితో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. శంకుస్థాపన శిలాఫలకం నుంచి కొద్దిదూరంలో చేపడుతున్న కెనాల్ రిటైనింగ్ వాల్ పనుల్ని పరిశీలించారు. ఈ సందర్బంగా యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ గెలవకపోవడంపై చంద్రబాబు రైతులను ప్రశ్నించడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
యర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన తాటపర్తి చంద్రశేఖర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ గెలవలేదు. రాష్ట్రంలో టీడీపీ ఇప్పటివరకు గెలవని కొద్ది నియోజకవర్గాల్లో యర్రగొండపాలెం ఒకటిగా చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే సంకల్పంతో కేడర్ ను ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కాపురం పర్యటనలో భాగంగా దోర్నాల వద్ద రైతులతో ముచ్చటిస్తూ ఈ నియోజకవర్గంలో ఓట్లు ఎందుకు వేయలేదు అన్ని ప్రశ్నించడం ఆసక్తికర చర్చకు దారితీసింది.
తన హయాంలోనే మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశామని చెబుతున్నారు. అదే సమయంలో మార్కాపురం జిల్లా పరిధిలో నాలుగు నియోజకవర్గాలకు మేలు చేసే వెలిగొండ ప్రాజెక్టు పనులు చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు. వెలిగొండకు తానే శంకుస్థాపన చేశానని, ప్రాజెక్టును కూడా తానే పూర్తి చేస్తున్నానని సీఎం అంటున్నారు. ఈ విషయాలనే రైతులు వెంకటేశ్వరరెడ్డి, సురవరం గండి వీరారెడ్డితో చెప్పగా, వారు కూడా సీఎం చంద్రబాబు వల్లే తమకు తాగు, సాగునీటి సమస్య పరిష్కారమవుతోందని వ్యాఖ్యానించారు. ఇంతలోనే తాను ఇలా అభివృద్ధి చేస్తున్నా, ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఓట్లు వేయలేదని చంద్రబాబు సూటిగా ప్రశ్నించడంతో రైతులు కాస్త తడబాటుకు లోనయ్యారు.
ఆ వెంటనే ఓ రైతు తేరుకుని, తాము చేసిన తప్పు తెలుసుకున్నామని ఈ సారి టీడీపీ నేత ఎరిక్షన్ బాబును గెలిపిస్తామని చంద్రబాబుకు భరోసా ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమం తర్వాత మార్కాపురం పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలోనూ యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఓడిపోయామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా 94 శాతం స్ట్రైక్ రేటుతో గెలిచామని, ఉత్తరాంధ్ర నుంచి ఉమ్మడి ప్రకాశం వరకు క్లీన్ స్వీప్ చేస్తే, ఒక్క ప్రకాశం జిల్లాలో రెండు చోట్ల వైసీపీ గెలిచిందని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు చోట్లా టీడీపీని గెలిపించాలని సీఎం సభాముఖంగా కోరారు.
ఇక రైతులతో సంభాషణల సమయంలోనూ, మార్కాపురం సభలోనూ చంద్రబాబు మాట్లాడిన మాటలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రైతులతో సామాన్యుడిలా కలిసిపోయి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు భవిష్యత్తులో సాగునీటి సమస్య తలెత్తదని అభయమిచ్చారు. మార్కాపురం ప్రాంతంలో హార్టికల్చర్ పంటలను సాగు చేయాలని సూచించారు. కాగా, ప్రాజెక్టులో రూ.2500 కోట్ల విలువైన పనులు మిగిలి ఉన్నా వాటిని పూర్తి చేయకుండా జాతికి అంకింతం చేసినట్టు గత పాలకులు నాటకాలాడారని సీఎం విమర్శలు గుప్పించారు. ఫీడర్ కాలువ లైనింగ్ పనుల్ని స్వయంగా పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకోవడమే కాకుండా, స్థానికంగా వివిధ చెరువులు, నీటి వనరుల్ని నింపేందుకు అవసరమైన స్ట్రక్చర్లను పూర్తి చేయాలని ఆదేశించారు. వెలిగొండ టన్నెళ్ల పనులు పూర్తి అయ్యాక, పోరుమామిళ్ల, రాచర్లకు కూడా నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.