వారి రుణం బాబు తీర్చేసుకుంటారా ?
టీడీపీ అధినేత చంద్రబాబుని నమ్ముకుంటే పదవులు అవే వస్తాయని టీడీపీలో చెబుతూ ఉంటారు.;
టీడీపీ అధినేత చంద్రబాబుని నమ్ముకుంటే పదవులు అవే వస్తాయని టీడీపీలో చెబుతూ ఉంటారు. చంద్రబాబు వద్ద ఆలస్యం అయితే అవవచ్చు కానీ అన్యాయం మాత్రం జరగదు అని అంటారు. అలా చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. బాబు అన్నీ ఆలోచించి అన్ని విధాలుగా బేరీజు వేసుకుని మరీ పదవులు అప్పగిస్తూంటారు.
ఆ విధంగా లేట్ అవడం వల్ల బాబు పదవులు ఇవ్వరు అన్న పేరు అయితే వచ్చింది కానీ బాబు ఇచ్చినన్ని పదవులు ఆయన ఎక్కించినన్ని అందలాలూ మరే అధినేత చేయలేదు అన్నది తెలుగు నాట రాజకీయ చరిత్ర నిరూపిస్తుంది. ఇక బాబు హస్తవాసి మంచిది అని చెబుతారు. ఆయన చేరదీసిన వారు ఆయన వెంట నడచిన వారు అతి పెద్ద పదవులు తరువాత కాలంలో అందుకున్నారు అన్నది కూడా చరిత్రలో పదిలంగా ఉంది.
అంత దాకా ఎందుకు. ఒకే ఒక్క మాట బాబుని దగ్గరుండి చూసిన వారు చెబుతారు. బాబుని నమ్ముకుని ఎవరూ నష్టపోలేదని, బాగుపడ్డారని కూడా అంటారు. ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు తనతో పాటు పనిచేసిన వారు తనతో అన్ని విధాలుగా సహకరించిన వారు ఇలా సీనియర్లు అందరికీ ఎంతో న్యాయం చేశారు. ఇంకా చేయాలని చూస్తున్నారు.
తాజాగా చూస్తే ఒకే ఒక ఉదంతం కళ్ళ ముందు ఉంది. విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత బాబు సమకాలీనుడు అయిన పూసపాటి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ గా పదవిని ఇప్పించడం ద్వారా బాబు ఆయన రుణం తీర్చుకున్నారు అని అంటారు. మొదటి నుంచి బాబు వెంట ఉండి 1995 సంక్షోభంలో బాబుకు అండగా నిలిచి ఆయన సీఎం కావడానికి ఎంతో సహకరించిన అశోక్ ని రాజ్ భవన్ కి పంపించడం ద్వారా బాబు ఆయనకు న్యాయం చేసారు అని అంటున్నారు.
అదే విధంగా చూస్తే 1978 లో తొలిసారి నెగ్గి తనతో పాటే ఉన్న కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ నేత కేఈ క్రిష్ణమూర్తికి కూడా గవర్నర్ పదవిని ఇప్పించాలని బాబు చూస్తున్నారు. ఈ విషయంలో బాబు ప్రయత్నం ఫలించిందని తొందరలోనే ఆ శుభవార్త వినిపించడం ద్వారా తన సహచరుడిని రాజ్ భవన్ ద్వారా తీసుకుని వెళ్ళాలని బాబు భావిస్తున్నారు.
మరో సీనియర్ నేత బాబుకు అండగా అన్ని వేళలలో నిలిచిన యనమల రామక్రిష్ణుడికి కూడా న్యాయం చేస్తారు అని అంటున్నారు. యనమల రాజ్యసభ సభ్యుడు కావాలని అనుకున్నారు. అది 2013 నాటి కోరిక. అయితే ఆయనను వరసగా రెండు సార్లు ఎమ్మెల్సీగా చంద్రబాబు చేశారు. ఇక 2026లో ఆయనను రాజ్యసభ సభ్యుడిని చేయడం ద్వారా ఆయన రుణం కూడా తీర్చేసుకోవాలని బాబు చూస్తున్నారు అని అంటున్నారు.
అదే విధంగా చంద్రబాబుకు మొదటి నుంచి గట్టి మద్దతుదారుగా ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన చింతకాయల అయ్యనపాత్రుడిని స్పీకర్ గా చేసి రుణం తీర్చుకున్నారు. మామూలుగా అయితే 2024లో టీడీపీ చేసిన కేబినెట్ కూర్పులో అయ్యన్నకు మంత్రి పదవి దక్కే చాన్స్ లేదు. దాంతో ఆయన ఖాళీగా ఉండిపోకుండా రాజ్యాంగబద్ధమైన పదవిని అప్పగించి తగిన న్యాయం చేశారు చంద్రబాబు
ఇక బాబు లిస్టులో ఎంతమంది సీనియర్లు ఉన్నారో చూడాలని అంటున్నారు. ఈ టెర్మ్ లో తన చేతిలో మరో నాలుగేళ్ళ అధికారం ఉంది. ఈలోగా వారందరికీ తగిన అవకాశాలు ఇచ్చి సముచితంగా గౌరవించాలని బాబు పక్కాగా డిసైడ్ అయ్యారని అంటున్నారు. 2029 నాటికి టీడీపీ స్వరూపం పూర్తిగా మారుతుంది అని అంటున్నారు.
నారా లోకేష్ నాయకత్వంలో టీడీపీలో యంగ్ లీడర్స్ అత్యధిక శాతం కనిపిస్తారు. దాంతో తన సహచరులు ఎవరూ ఇబ్బంది పడకుండా ఇప్పటి నుంచే వారికి అన్ని విధాలుగా తగిన స్థానం చూపిస్తున్నారు చంద్రబాబు అని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు ఈ వైఖరిని ఆయన ఆలోచనా విధానాన్ని చూసిన వారు బాబు పదవులు ఇవ్వరు, అన్యయాం చేస్తారు అని అనగలరా. బాబు అందరికీ న్యాయం చేస్తారు. నమ్ముకున్న వారికి తాను నమ్మకం ఉంచిన వారికి అయితే పూర్తి న్యాయం చేస్తారు అని అంటున్నారు.