టీడీపీ వర్సెస్ వైసీపీ : పేరు పెట్టి పిలవడాలు లేవంతే !
జగన్ తాజాగా నంద్యాల పర్యటనలో ప్రెస్ తో మాట్లాడుతూ వెన్ను పోటు పార్టీ అని టీడీపీ పేరు ఎత్తకుండా మాట్లాడుతూ ఘాటైన విమర్శలు చేశారు.
నీవు ఒకటి అను నేను రెండు అంటాను అన్నట్లుగా ఉంది ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల పరిస్థితి. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో రాజకీయం సాగుతోంది. ప్రత్యర్ధులుగా ఉండాల్సిన పార్టీలు శతృవులుగా మారిపోతున్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఒకరిని ఒకరు ముఖాలు చూసుకుని ఏళ్ళు గడచిపోతున్నాయి. రాజకీయాలకు అతీతంగా నిర్వహించే గవర్నర్ ఎట్ హోం వంటి వాటికి కూడా చంద్రబాబు జగన్ కలిసి కనిపించడం లేదు. దేశంలో మిగిలిన రాష్ట్రాలలో అయితే అధికార విపక్షాలు కలిసి ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఏపీ మాత్రం దానికి పూర్తి భిన్నం. ఇపుడు చూస్తే ఈ రాజకీయం కాస్తా మరింత పీక్స్ కి చేరుతోంది.
గొడ్డలి పార్టీ అంటూ :
ఏపీలో వైసీపీని గొడ్డలి పార్టీగా పేరు పెట్టి టీడీపీ గత కొంతకాలంగా ప్రచారం చేస్తోంది. ఈ మేరకు టాప్ లీడర్స్ నుంచి లోకల్ లీడర్స్ దాకా అంతా వైసీపీ అని పిలవడం ఎపుడో మానేశారు. ఈ విధంగా గొడ్డలి పార్టీ అని జనంలో ప్రచారం చేస్తే ఆ వ్యతిరేకత పెరిగి వైసీపీని జనాలు దూరం పెడతారు అన్నది ఒక రాజకీయ ఎత్తుగడ. అంతే కాదు వివేకా హత్య కేసుని నిరంతరం లైం లైట్ లో ఉంచడం కూడా ఇందులో భాగం. ఆ విధంగా గొడ్డలి పార్టీ అని వైసీపీని దాని నాయకుడు అంటూ జగన్ ని పేరు పెట్టకుండా టీడీపీ విమర్శిస్తోంది. ఇపుడు వైసీపీ కూడా అదే రూట్ లో వెళ్తోంది.
జగన్ నోట ఆ మాట :
జగన్ తాజాగా నంద్యాల పర్యటనలో ప్రెస్ తో మాట్లాడుతూ వెన్ను పోటు పార్టీ అని టీడీపీ పేరు ఎత్తకుండా మాట్లాడుతూ ఘాటైన విమర్శలు చేశారు. వెన్ను పోటు పార్టీ నాయకుడు అని చంద్రబాబుని కూడా పేరు పెట్టకుండా హాట్ కామెంట్స్ చేశారు. దాంతో వైసీపీ టీడీపీ అన్న పేరు ఇక మీదట పలికే చాన్స్ లేదు అన్న మాట అని అందరికీ అర్ధం అవుతోంది. వెన్ను పోటు పార్టీ ఉందే అంటూ వైసీపీ నాయకులు సాగదీస్తూ మాట్లాడుతున్నారు. వెన్నుపోటు అంటే ఎన్టీఆర్ ని 1995లో వెన్నుపోటు పొడిచి అధికారం అందుకున్నారు అన్నది జనంలో రిజిస్టర్ కావాలన్నది వైసీపీ ఎత్తుగడ. అంతే కాదు జనాలకు హామీ ఇచ్చి మోసం చేస్తున్నారు వెన్నుపోట్లు పొడుస్తున్నారు అన్నది కూడా వైసీపీ మరో ఆరోపణ. అదే సమయంలో టీడీపీకి బూడిద పార్టీ అని రెండవ పేరు కూడా వైసీపీ పెట్టింది. విజయవాడ క్రిష్ణ లంకలో సాయిక్రిష్ణని చంపేసి బూడిదను కూడా ఇవ్వలేదని లాకప్ డెత్ ని గుర్తు చేసేలా ఈ పేరు పెట్టారు అని అంటున్నారు. అంటే టీడీపీ గొడ్డలి పార్టీ అని ఒక ట్యాగ్ వైసీపీకి తగిలిస్తే వైసీపీ టీడీపీకి రెండు ట్యాగ్స్ తగిలించింది అన్న మాట.
ఇక ఇంతేనా అంటే :
రాజకీయాలు అంటే ప్రజా సేవ. ప్రజలకు మేలు చేయడం కోసం నాయకులు పోటీ పడాలి. ఆ విషయం మీద సిద్ధాంతపరంగా విభేదించుకోవచ్చు. కానీ ఏకంగా తమ మీద తామే బురద జల్లుకుంటూ విమర్శలను కూడా పీక్స్ కి చేరుతూ రాజకీయాన్ని ఎటు తీసుకుని పోతున్నారు అంటే జవాబు చెప్పడం కష్టమే. ఏపీలో చూస్తే గత కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఈ రెండు పార్టీల రాజకీయం రెండు కులాలు రెండు కుటుంబాల రాజకీయం జనాలకు కూడా ఒకింత విసుగు తెప్పించేలా ఉందని అంటున్నారు. దేశంలోని మిగిలిన చోట్ల మాదిరిగా ఏపీలో రాజకీయం ఎందుకు హుందాగా ఉండదని సగటు జనాల నుంచి వచ్చే ప్రశ్నలకు బహుశా జవాబు ఇప్పటప్పట్లో ఉండదేమో.