గన్నవరంలో ల్యాండ్ అయిన చంద్రబాబు హెలికాప్టర్.. ఏం జరిగింది?
ఇటీవల కాలంలో విమానాలు, హెలీకాప్టర్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయనే వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన వరుస ఘటనలు అందుకు కారణం. ఆ సంగతి అలా ఉంచితే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గన్నవరంలో ల్యాండ్ అయ్యింది.
అవును... కొవ్వూరులో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్ లో సీఎం చంద్రబాబు ఈ రోజు ఉదయం బయలు దేరారు. అయితే... వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న విమానం గన్నవరం ఎయిర్ పోర్ట్ లో తిరిగి ల్యాండ్ అయింది. దీంతో... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనపై సందిగ్ధత నెలకొందని అంటున్నారు.
అయితే... తగ్గేదేలే అని సీఎం ఫిక్సయ్యారని.. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో రాజమండ్రికి వెళ్లి అక్కడ నుంచి షెడ్యూల్ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు.. సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించేందుకు తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో ఈ రోజు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు!
కాగా... ఏపీలో పింఛన్లను ఇంటికే వెళ్లి ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇలా ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికే వెళ్లి పింఛన్లు ఇచ్చే కార్యక్రమంలో చంద్రబాబు, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా.. చంద్రబాబు వెళ్లిన ప్రతి ఇంటికి ఏదో ఒక హామీ కూడా ఇస్తున్నారు.