సంపద సృష్టించేది రైతులు కాదా బాబూ ?

తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో జరిగిన సీఐఐ బిజినెస్ సమ్మిట్ కి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పారిశ్రామికవేత్తల వల్లనే సంపద పెరుగుతుందని అన్నారు.;

Update: 2025-06-02 01:30 GMT

తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో జరిగిన సీఐఐ బిజినెస్ సమ్మిట్ కి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పారిశ్రామికవేత్తల వల్లనే సంపద పెరుగుతుందని అన్నారు. ఏపీకి పరిశ్రమలు రావాలని పెద్ద ఎత్తున వారు పెట్టాలని కోరారు.

ఇదిలా ఉంటే ఏడాదిగా కూటమి పాలనలో పరిశ్రమల స్థాపన కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఆ దిశగానే కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు. పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని దాని వల్ల ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుందని కూడా భావిస్తున్నారు.

అయితే మాజీ ఎంపీ రైతు సంఘాల సమన్వయ సమితి ఏపీ కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ పరిశ్రమలు రావాలి,పెట్టుబడులు రావాలని తాపత్రయం తప్ప రైతులకు న్యాయం జరగాలని ఆలోచన ఎందుకు చేయడం లేదని చంద్రబాబుని ప్రశ్నించారు. నూటికి అరవై శాతం మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

రైతులను పక్కన పెట్టి కేవలం పారిశ్రామికవేత్తలే సంపదను సృష్టిస్తారని బాబు చెప్పడం మంచిది కాదని అన్నారు. స్వామినాధన్ కమిషన్ సిఫార్సులను దేశంలో ఎందుకు అమలు చేయరని ఆయన ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం ఈ సిఫార్సులు అమలు చేయడం కుదరదు అని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని ఆయన గుర్తు చేశారు.

రైతుల ఆత్మహత్యలను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటి చేసే అనేక సిఫార్సులు అందులో ఉన్నాయని వాటిని అమలు చేయకపోవడం కూటమి ప్రభుత్వం తప్పిదమే అని వడ్డే ఘాటుగా విమర్శించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

సంపదను సృష్టించే విషయంలో రైతులది కూడా ముఖ్య పాత్ర అని ఆయన పేర్కొన్నారు. ఏపీలో కౌలు రైతుల కష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. మొత్తం వ్యవసాయంలో సగానికి సగం కౌలు రైతులే చేస్తున్న్నారని అయితే వారు పండించే పంటలకు మాత్రం గిట్టుబాటు ధరలు రావడం లేదని ఆ విధంగా వారు తీవ్రంగా నష్టపోతున్నారని వడ్డే అన్నారు.

కొనుగోలుదారులు కౌలు రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని తక్కువ ధరలకే పంట కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఇక చూస్తే ఏపీలో కొన్ని పంటలను కొనే పరిస్థితి అసలు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు పొగాకు పంటని ఎవరూ కొనడం లేదని అన్నారు.

పరిశ్రమలను ప్రోత్సహించడానికి తాము వ్యతిరేకం కాదని అదే సమయంలో రైతులను కూడా చూడాల్సి ఉందని అన్నారు. అలాగే పరిశ్రమలకు ఎక్కువ భూములు ఇవ్వవద్దని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి వడ్డే రైతుల విషయంలో చేయాల్సిన మేలు చాలా ఉందని గుర్తు చేశారని అంటున్నారు.

Tags:    

Similar News