చంద్రబాబు ఫొటోనే వాడేశారు? రూ.22 వేలతో భారీ లాభాలు అంటూ ప్రకటన
అమాయకులను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు ఎంతకైనా తెగిస్తారని చెప్పేందుకు ఈ ఉదంతం ఓ చక్కని ఉదాహరణ.;
అమాయకులను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు ఎంతకైనా తెగిస్తారని చెప్పేందుకు ఈ ఉదంతం ఓ చక్కని ఉదాహరణ. డిజిటల్ వేదికగా రకరకాల మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు ఈ సారి తమ తెలిని బాగా ఉపయోగించారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోనే వాడేసి ఫేక్ ప్రకటన జారీ చేశారు. రూ.22 వేలు పెట్టుబడి పెడితే భారీ లాభాలు పొందండి అంటూ ఆన్ లైన్ లో ప్రకటన ఇచ్చారు. ఈ విషయం సైబర్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ కేటుగాళ్ల మాయలో పడొద్దని, ఇటువంటి ఫేక్ ప్రకటనపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.
రకరకాల మోసాలకు పాల్పడుతున్న మాయగాళ్లు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో, వీడియోనే వాడేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టెక్నాలజీతో అద్భుతాలు సృష్టించొచ్చని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అయితే ఆయన మాటల వీడియోను సైబర్ కేటుగాళ్లు వక్రీకరించి ఓ నకిలీ వీడియోను తయారు చేశారు. ‘‘22 వేల రూపాయలు పెట్టుబడి పెట్టిండి.. ఫోన్ ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం పొందండి’’ అని చంద్రబాబు చెప్పినట్లు ఆ వీడియో రూపొందించారు. అంతేకాకుండా ఈ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రజలను మోసం చేయాలని ప్లాన్ చేశారు.
ఈ విషయం ఏపీ సైబర్ క్రైమ్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ దృష్టికి వెళ్లడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ నకిలీ వీడియో వైరల్ కాకుండా అడ్డుకోవడంతోపాటు సైబర్ మోసగాళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్ ను రంగంలోకి దింపారు. గతంలో కూడా ప్రధాని మోదీ పేరుతో ఇటువంటి ప్రకటనలే జారీ అయ్యాయని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ‘‘500 రూపాయలు పెట్టుబడి పెడితే రూ.5 వేలు లాభం వస్తుంది’’ అని గతంలో ప్రధాని పేరుతో ప్రకటలు జారీ చేశారని, అదేవిధంగా రతన్ టాటా ఉచితంగా పది వేలు ఇల్లు ఇస్తున్నారని, బిట్ కాయిన్ లో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించాలని ఇద్దరు వ్యక్తులు ఫేక్ వీడియోలు సృష్టించారన సైబర్ పోలీసులు చెబుతున్నారు. అయితే తాజాగా చంద్రబాబు పేరుతో వీడియో తయారు చేసిన వారు ఎవరన్నది తేలాల్సివుంది. వీరి బారిన పడి ఎవరైనా మోసపోయారా? లేదా? అన్నది సైబర్ పోలీసులు ఆరా తీస్తున్నారు.