తమిళనాడుకు షాక్ ఇచ్చిన చంద్రబాబు.. అసలు ఏం జరిగిందో తెలుసా?
పెట్టుబడుల ఆకర్షణ, కొత్త పరిశ్రమల ఏర్పాటులో పొరుగు రాష్ట్రాలతో కూటమి ప్రభుత్వం పోటీపడుతోంది.;
పెట్టుబడుల ఆకర్షణ, కొత్త పరిశ్రమల ఏర్పాటులో పొరుగు రాష్ట్రాలతో కూటమి ప్రభుత్వం పోటీపడుతోంది. ఐటీ అనుబంధ రంగ పరిశ్రమలను కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి విశాఖకు తన్నుకుపోయేలా మంత్రి లోకేశ్ పావులు కదుపుతున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదేవిధమైన చర్యలతో మరో పొరుగు రాష్ట్రం తమిళనాడుకు ఝలక్ ఇచ్చారు. చంద్రబాబు చాకచక్యంతో పావులు కదిపి సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ షూ తయారీ సంస్థ హ్వాసెంగ్ ను తన సొంత నియోజకవర్గం కుప్పం తీసుకువచ్చారు.
సౌత్ కొరియా సంస్థ హ్వాసెంగ్ నాన్ - లెదర్ షూలు తయారు చేస్తుంది. గ్లోబెల్ బ్రాండ్లు అయిన Nike, Adidas షూలను ఈ సంస్థే తయారు చేస్తుంది. ఏడాదికి దాదాపు 20 మిలియన్ షూల తయారీ సామర్థ్యం ఉన్న ప్లాంట్ ను మన దేశంలో ఏర్పాటు చేయాలని భావించిన హ్వాసెంగ్ సంస్థ యాజమాన్యం ముందు తమిళనాడు ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఆగస్టు నెలలో దీనికి సంబంధించిన ఎంవోయూ కూడా కుదుర్చుకుంది. అయితే ఇటీవల కాలంలో కొత్త పరిశ్రమలకు అనుమతులు, ప్రోత్సాహకాలు ఇవ్వడంలో దూకుడు మీదున్న కూటమి ప్రభుత్వం హ్వాసెంగ్ సంస్థను ఏపీకి తీసుకువచ్చేలా పావులు కదిపి సక్సెస్ అయింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో తమిళనాడులో ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న తన నిర్ణయాన్ని హ్వాసెంగ్ మార్చుకుంది. తమిళనాడుకు సమీపంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ప్లాంట్ స్థాపనకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంది. సుమారు 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 20 వేల మందికి ఉపాధి కల్పించే హ్వాసెంగ్ కంపెనీ కుప్పం రావడంపై స్థానికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు దగ్గరగా ఉండటం వల్ల కుప్పంలో ప్లాంట్ ఏర్పాటు తమిళనాడు కన్నా బెటర్ అన్న ఆలోచనతో హ్వాసెంగ్ తమ నిర్ణయం మార్చుకున్నట్లు చెబుతున్నారు.
హ్వాసెంగ్ కంపెనీ నిర్మాణానికి కుప్పం నియోజకవర్గంలో రెండు గ్రామాల పరిధిలో వంద ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించేందుకు ముందుకొచ్చింది. పరిశ్రమ ఏర్పాటుకు తమిళనాడు, ఏపీ ఒకేలాంటి ప్రోత్సాహాకాలు ప్రకటించినా, ఏపీ ఒక అడుగు ముందుకేసి రూపాయికే ఎకరా భూమి కేటాయించడంతో హ్వాసెంగ్ ఇటు మళ్లినట్లు చెబుతున్నారు. నిర్ణీత సమయంలోగా ప్లాంట్ నిర్మించి, ఉత్పత్తి ప్రారంభించాలన్న నిబంధనతో హ్వాసెంగ్ కు రూపాయికే భూమి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు.