అమిత్ షాకు అన్నీ చెప్పి బాబు...గుడ్ న్యూస్ ఉందా ?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల ఢిల్లీ టూర్ బిజీ బిజీగా సాగుతోంది. ఆయన నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు.;

Update: 2025-07-15 18:17 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల ఢిల్లీ టూర్ బిజీ బిజీగా సాగుతోంది. ఆయన నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఆయనతో ప్రత్యేకంగా భేటీ వేసి అనేక అంశాలను చర్చించారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజుకు గోవా గవర్నర్ గా అవకాశం ఇవ్వడం పట్ల బాబు అమిత్ షాకు ధన్యవాదాలు తెలియచేశారు.

అక్కడ నుంచి ఆయన ఏపీ ప్రాజెక్టుల గురించి కేంద్ర హోం మంత్రి దృష్టికి తెచ్చారు బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఏవిధంగా ఫోకస్ పెట్టిందో దాని వల్ల కలిగే లబ్ధి ఏమిటి పొరుగు రాష్ట్రం తెలంగాణాకు ఏ విధంగానూ నష్టం ఉండదన్న విషయం విడమరచి చెప్పారు.

ఈ ప్రాజెక్ట్ ఏపీలో ఎన్డీయే ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం అని బాబు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే రాయలసీమ పూర్తిగా క్షామం నుంచి బయటపడుతుందని కూడా బాబు చెప్పారు. ఇక గోదావరి ఎగువ దిగువ రాష్ట్రాలు పూర్తిగా నీటిని వినియోగించుకున్న మీదటన కూడా ప్రతీ ఏటా తొంబై నుంచి 120 దాకా రోజుల పాటు మిగులు నీరు ఉంటుందని జలవనరుల గణాంకాలు ఉన్నాయని బాబు తెలియచేశారు. గోదావరికి ఏపీ చివరి రాష్ట్రమని మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకే ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

మరో వైపు చూస్తే ఏపీ ఆర్ధిక పరిస్థితి మీద కూడా అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ఏపీలో గత అయిదేళ్ళూ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని దానిని ఏడాది కాలంలో ఒక రూపునకు తీసుకుని రాగలిగామని బాబు వివరించారు. దాని వల్ల కొంత వరకూ కోలుకున్నా కూడా ఇంకా ఆర్థిక కష్టాలు ఏపీలో ఎన్నో ఉన్నాయని బాబు అమిత్ షాకు చెప్పారు.

ఈ రోజున చూస్తే ఏపీ అన్ని విద్ధాలుగా తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉందని బాబు అమిత్ షాకు విడమరచి చెప్పారు. ఇన్నాళ్ళు చేసిన సాయం ఒక ఎత్తు అయితే ఇపుడు కేంద్రం పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉందని బాబు స్పష్టం చేశారని అంటున్నారు. కేంద్రం ఎంత వీలైతే అంత సాయం ఉదారంగా ఏపీకి చేస్తేనే ఆర్ధికంగా మళ్ళీ పుంజుకోగలమని బాబు అంటున్నారుఇ.

నిజానికి చూస్తే ఏపీ అప్పులతోనే నెట్టుకుని వస్తోంది. ఒక వైపు ఉద్యోగుల జీతాలు ఉన్నాయి. మరో వైపు సంక్షేమ పధకాలు ఉన్నాయి. ఇంకో వైపు అభివృద్ధి కార్యక్రమాల అజెండా ఉంది. దాంతో ఏపీ ఇపుడు అనూహ్యంగా ఆర్ధిక సవాళ్ళను ఎదుర్కోంటోంది. దాంతో బాబు ఢిల్లీ టూర్ లో ఆర్ధికంగా కేంద్రం ఆదుకోవాలని ఒప్పించే ప్రయత్నం ఉందని చెబుతున్నారు. అందుకే కేంద్రంలో కీలకంగా ఉన్న అమిత్ షా దృష్టిలో బాబు ఈ విషయం పెట్టారని అంటున్నారు.

ఏపీ విభజన వల్ల కూడా పూర్తిగా నష్టపోయిందని ఆ ఆర్ధిక నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని 16వ ఆర్ధిక సంఘం ద్వారా భారీ ఎత్తున నిధులు కేటాయింపులు ఏపీకి జరిగేలా చూడాలని బాబు కోరుతున్నరు. మరి కేంద్రం బాబు విన్నపాల మీద ఏ విధంగా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News