అమరావతి పునఃనిర్మాణం... మోడీ ముందు చంద్రబాబు ప్రతిజ్ఞ!
అవును... ఏపీ కలల రాజధాని అమరావతి కేవలం నగరం మాత్రమే కాదని... ఇది ఐదుకోట్ల ప్రజల సెంటిమెంట్ అని చంద్రబాబు అన్నారు.;
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పునఃనిర్మాణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా అమరావతి గురించి, భూములిచ్చిన రైతుల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఒక కీలక విషయంలో మోడీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం కీలకంగా మారింది. పహల్గాం దాడి అనంతరం మోడీలో తాను గ్రహించిన మార్పును బాబు వెల్లడించారు.
అవును... ఏపీ కలల రాజధాని అమరావతి కేవలం నగరం మాత్రమే కాదని... ఇది ఐదుకోట్ల ప్రజల సెంటిమెంట్ అని చంద్రబాబు అన్నారు. ఇదే సమహ్యంలో.. ఇది నగరం మాత్రమే కాదని.. ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ఆశ, ఆకాంక్షలకు ప్రతిరూపమని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతులు ఏకంగా 34 వేల ఎకరాలు పూలింగ్ కింద ఇచ్చారని తెలిపారు.
ఇలా 29 వేల మంది రైతులు, 34 వేల ఎకరాల భూమిని రాజధానికి పూలింగ్ కి ఇవ్వడం అనేది దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇదొక చరిత్ర అని సీఎం అన్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వం హయాంలో ఎన్నో ఇబ్బందులకు ఓర్చి అమరావతి కోసం రైతులు వీరోచితంగా పోరాడారని, వారి పోరాటం వల్లే అమరావతి పునః ప్రారంభమైందని, ఇది మీ విజయమని అన్నారు.
అలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో మోడీపై నమ్మకం, టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తే రాష్ట్రం మొత్తం తిరగబడిందని.. 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజాతీర్పుతోనే అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుందని.. ఫలితంగా పది నెలల్లోనే సవాళ్లను అదిగమించి.. కేంద్రం సహకారం, మోడీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కించామని చంద్రబాబు అన్నారు.
ఇదే సమయంలో.. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ పదో స్థానంలో ఉండగా.. ఇప్పుడు అది ఐదో స్థానానికి ఎదిగిందని.. త్వరలోనే మూడో స్థానానికి చేరుతుందని.. ఫలితంగా 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని చంద్రబాబు అన్నారు. ఇక తాజాగా తీసుకున్న కులగణన నిర్ణయం గొప్పదని కొనియాడారు.
గతంలో అమరావతికి మోడీయే శంకుస్థాపన చేశారని.. మళ్లీ ఇప్పుడు మోడీ చేతుల మీదుగానే పనులు పునఃప్రారంభమవుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ నేపథ్యంలోనే... గతంలో మోడీని ఎప్పుడు చూసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారని.. అయితే ఇటీవల కలిసినప్పుడు చాలా గంభీరంగా ఉన్నారని.. పహల్గంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో ఆయన ఉన్నారని అన్నారు.
ఈ సందర్భంగా... ఉగ్రవాదంపై పోరులో కేంద్రం తీసుకునే ప్రతీ చర్యకూ తాము అండగా ఉంటామని.. మోడీకి అండగా ఉంటామని చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు. "మోడీజీ మేమంతా అండగా ఉన్నాం.. వందేమతరం.. భారత్ మాతాకీ జై" అంటూ చంద్రబాబు నినాదాలు చేశారు.. ప్రజలతోనూ నినాదాలు చేయించారు.