ప్రాజెక్టుల ప్రొఫైల్స్‌.. కూట‌మికి కొంగు బంగార‌మేనా.. ?

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 ప్రాజెక్టుల‌ను పూర్తిచేస్తామ‌ని.. పేర్కొంటూ సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా ఓ జాబితాను విడుద‌ల చేశారు.

Update: 2026-07-17 22:30 GMT

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 ప్రాజెక్టుల‌ను పూర్తిచేస్తామ‌ని.. పేర్కొంటూ సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా ఓ జాబితాను విడుద‌ల చేశారు. ఈ ఏడాది నుంచి 2028 వ‌ర‌కు షెడ్యూల్ ప్ర‌క‌టించారు. ఏయే నెల్ల‌లో ఏయే ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తార‌న్న విష‌యాల‌ను ఆయ‌న వివ‌రించారు. వీటిలో కీల‌క‌మైన పోల‌వ‌రం నుంచి హంద్రీనీవా వ‌ర‌కు., ప‌ల్నాడు ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్న వ‌రిక‌పూడి సెల నుంచి గాలేరు-న‌గ‌రి వ‌ర‌కు అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిని పూర్తి చేయ‌డం ద్వారా.. రైతుల‌కు మేలు చేస్తామ‌ని చెబుతున్నారు.

వ‌ర్క‌వుట్ అయితే.. దీనికి మించిన ఎన్నిక‌ల అజెండా మ‌రొక‌టి ఉండ‌దు. కానీ, ఈ ప్రాజెక్టుల పూర్తికి దాదాపు ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌కు పైగానే అవుతాయ‌ని.. ప్ర‌భుత్వ లెక్క‌లే చెబుతున్నాయి. ఆ ఆమేర‌కు నిధులు స‌ముపార్జించ‌గ ల‌రా? అనేది ప్ర‌శ్న‌. వ‌చ్చే ఏడాది జూన్ నాటికి పోల‌వ‌రం తొలిద‌శ పూర్త‌వుతుంద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ఇది క‌నుక సాకారం అయితే.. స‌గం గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వానికి మంచి ఫాలోయింగ్ పెరుగుతుంది. ఇక‌, ఇత‌ర జిల్లాల‌లోనూ ఈ హ‌వా క‌నిపిస్తుంది.

అయితే.. ప్రాజెక్టుల పూర్తి ఎలా ఉన్నా.. ప్ర‌స్తుతం నెల‌కొన్న నీటి ఎద్ద‌డి, ఎల్‌నినో ప్ర‌భావం వంటివాటిని అధిగమిం చాల్సిన అవ‌స‌రం ప్ర‌భుత్వంపై ఉంది. అంతేకాదు.. కృష్ణాడెల్టా ప‌రిస్థితి దారుణంగా ఉంది. దీనిని త‌ట్టుకుని ఈ ఏడాది ముందుకు సాగాలి. వీటిని ప్రాధాన్య అంశాలుగా తీసుకుని ప్ర‌భుత్వం ప‌నిచేస్తే.. అదే మేల‌ని వ్య‌వ‌సాయ రంగ నిపుణులు చెబుతున్నారు. భ‌విష్య‌త్తు మంచిదే అయినా.. ఇప్పుడున్న ప‌రిస్థితిని అర్ధం చేసుకుని ముందుకు సాగాల‌ని సూచిస్తున్నారు.

వ్యూహం వేరు.. !

కూట‌మి స‌ర్కారు వ్యూహం మ‌రోలా క‌నిపిస్తోంది. రైతుల‌ను ఆక‌ట్టుకునేందుకు ఇప్ప‌టికే అన్న‌దాత సుఖీభ‌వ అమ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కీల‌క మైన ప్రాజెక్టుల విష‌యంపై కూడా ప్ర‌క‌ట‌న చేస్తే.. అది త‌మ‌కు మ‌రింత లాభిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రాజెక్టుల క్యాలెండ‌ర్‌ను ప్ర‌క‌టించారు. ఇది స‌క్సెస్ అయితే.. తిరుగులేదు. కానీ, ల‌క్ష కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ మాటేంట‌న్న‌దే ప్ర‌శ్న‌. ఏదేమైనా.. ఇది సాకారం అయితే.. కూట‌మికి తిరుగులేద‌ని అంటున్నారు.

Tags:    

Similar News