నోటికి ప్లాస్టర్....అయ్యన్న సంచలన వ్యాఖ్యలు !
ఇదే విషయాన్ని పదే పదే ఆయన చెబుతూ వస్తున్నారు. తాజాగా మరోసారి అదే ఆయన చెప్పారు. తాను రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్నందువల్ల తన నోటికి ప్లాస్టర్ వేసినట్లుగా ఉందని తాజాగా మాట్లాడుతూ అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయ్యన్నపాత్రుడు ఫైర్ బ్రాండ్. ఆయన పాతికేళ్ళ వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. తన రాజకీయ జీవితం మొత్తం ఆయన దూకుడుగానే ఉంటూ వచ్చారు. అలాంటి అయ్యన్నపాత్రుడికి స్పీకర్ పదవి ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అయ్యన్న మంత్రిగా ఉంటే ఆయన నుంచి ప్రతీ రోజూ ఎన్నో కీలక ప్రకటనలు వచ్చేవని అంటారు. కానీ రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నందువల్ల ఆయన మాట్లాడలేకపోతున్నారు. ఇదే విషయాన్ని పదే పదే ఆయన చెబుతూ వస్తున్నారు. తాజాగా మరోసారి అదే ఆయన చెప్పారు. తాను రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్నందువల్ల తన నోటికి ప్లాస్టర్ వేసినట్లుగా ఉందని తాజాగా మాట్లాడుతూ అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉచితాల వ్యామోహం తగదు :
ఇదిలా ఉంటే ఉచిత పధకాల విషయంలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు బాటలోనే అయ్యన్న కూడా పయనిస్తున్నారు. ఉచిత పధకాల కంటే అభివృద్ధి మీద ఎక్కువగా ప్రజలు దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఏపీలో అయితే ఉచిత పధకాల మీదనే జనాలు దృష్టి పెడుతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలు తమ వంతు బాధ్యతను పోషించాలని ఆయన కోరారు. కేవలం సంక్షేమ పధకాల గురించే ఫోకస్ పెట్టకుండా రాష్ట్రం అభివృద్ధి గురించి కూడా ప్రజలు ఆలోచన చేయాలని ఆయన సూచించారు.
కేరళ ఒక ఉదాహరణ :
కేరళ ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలలోనే ఎక్కువగా పాలు పంచుకుంటారు అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉదహరించారు. వారు తమ రాష్ట్ర ప్రగతిని బలంగా కోరుకుంటూ ఉంటారు అని ఆయన చెప్పారు. అయితే ఏపీ ప్రజలు ఈ విషయంలో భిన్నమని వారు తమకు ఏమి వస్తాయన్న దాని మీదనే ఎక్కువగా చర్చిస్తూ ఉంటారని అయ్యన్న చురకలు అంటించారు. సంక్షేమం అవసరమే కానీ అభివృద్ధి గురించి కూడా జనాలు ఆలోచన చేయడం మేలు అయిన విషయం అని ఆయన అన్నారు.
పర్యావరణపైన కూడా :
అదే సమయంలో ప్రజలు పరిసరాల పచ్చదనం మీద కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టాలని కోరారు. పర్యావరణం విషయంలో ప్రజల భాగస్వామ్యం చాలా ఉండాలని ఆయన అన్నారు. ఏపీలో చూస్తే చెట్లు నరికేయడం మీదనే ఎక్కువగా ఫోకస్ ఉందని అదే సమయంలో కొత్త్గా ఒక మొక్కను నాటాలని కూడా ఆలోచించాలని ఆయన అన్నారు. ప్రతీ ఒక్కరూ కనీసం ఒక మొక్కను అయినా నాటాలని ఆయన పిలుపు ఇవ్వడం విశేషం. ఏపీలో అయిదు కోట్ల మంది దీనిని ఒక ఉద్యమంగా తీసుకుంటే రాష్ట్రం మొత్తం పచ్చదనంతో కళకళలాడుతుందని ఆయన అన్నారు.
రాజకీయ చర్చ తగ్గాలి :
ఏపీలో మీడియా అయినా సోషల్ మీడియా అయినా జనాల్లో అయినా రాజకీయాల మీదనే ఎక్కువగా చర్చ సాగుతూ ఉంటుంది. దీనిని కూడా అయ్యన్నపాత్రుడు గుర్తించారు. అందుకే ఆయన ఎప్పుడూ విమర్శలు ప్రతి విమర్శలేనా అని ఆయన అన్నారు. ఒక అభివృద్ధి విషయం మీద చర్చకు అందరూ సిద్ధపడినపుడే అంతా మార్పు వస్తుందని అన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రం కోసం అందరూ కలసి పనిచేస్తే ఏపీ అగ్ర స్థానంలో ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి నోటికి ప్లాస్టర్ వేశారు అంటూనే అయ్యన్న తాను చెప్పాలనుకున్న విషయాలు అన్నీ చక్కగానే చెప్పారు.