పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న 'బలూచిస్తాన్' స్వాతంత్య్ర ప్రకటన.. అంతర్జాతీయ గుర్తింపు సాధ్యమేనా?
పాకిస్తాన్‌లో ఇప్పటికే రాజకీయ, ఆర్థిక, భద్రతా సమస్యలు తీవ్రంగా ఉన్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాకిస్తాన్‌లో ఇప్పటికే రాజకీయ, ఆర్థిక, భద్రతా సమస్యలు తీవ్రంగా ఉన్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బలూచ్ వేర్పాటువాద వర్గాలు తాజాగా తమ ప్రాంతాన్ని "రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్"గా ప్రకటిస్తూ స్వాతంత్య్రాన్ని ప్రకటించాయి. ఇకపై తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నట్లు బలూచ్ ప్రతినిధులు ప్రకటించడం పాకిస్తాన్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
పదేపదే సవాళ్లు ఎదుర్కొంటున్న ఇస్లామాబాద్
బలూచిస్తాన్‌లో చాలా కాలంగా తిరుగుబాటుదారులు పాకిస్తాన్ సైన్యంపై దాడులు, భద్రతా స్థావరాలపై దాడులు, బాంబు పేలుళ్ల వంటి ఘటనలకు పాల్పడుతూ వస్తున్నారు. ఈ పరిణామాలతో ఆ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వ నియంత్రణ పదేపదే సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఏకంగా ఏకపక్షంగా స్వాతంత్య్ర ప్రకటన చేయడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది.
అయితే ఒక వర్గం స్వయంగా స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నంత మాత్రాన అది వెంటనే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దేశంగా మారదు. ప్రస్తుతం బలూచిస్తాన్‌పై పాకిస్తాన్ ప్రభుత్వ పరిపాలనా, సైనిక నియంత్రణ కొనసాగుతూనే ఉంది. అందువల్ల ఈ ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నప్పటికీ, చట్టపరంగా స్వతంత్ర దేశ హోదా పొందడం అంత సులభమైన ప్రక్రియ కాదు.
అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి?
అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. ముఖ్యంగా 1933 మాంటెవిడియో కన్వెన్షన్ ప్రకారం ఒక ప్రాంతం స్వతంత్ర దేశంగా పరిగణించబడాలంటే నాలుగు ప్రధాన అర్హతలు ఉండాలి. స్థిరమైన జనాభా , స్పష్టమైన భౌగోళిక సరిహద్దులు, సమర్థవంతమైన ప్రభుత్వం, ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. బలూచిస్తాన్‌కు జనాభా, భౌగోళిక పరిధి ఉన్నప్పటికీ.. మొత్తం ప్రాంతంపై పూర్తి నియంత్రణ సాధించడం, ప్రజలకు నిరంతర పరిపాలన అందించడం, స్థిరమైన సార్వభౌమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వంటి అంశాలు రాబోయే రోజుల్లో వారికి అత్యంత కీలకంగా మారనున్నాయి.
అంతర్జాతీయ గుర్తింపు.. ఒక పెద్ద అడ్డంకి
అంతర్జాతీయ గుర్తింపు లేకుండా ఏ ప్రాంతమైనా స్వతంత్ర దేశంగా సమర్థవంతంగా కొనసాగడం చాలా కష్టం. ఒక దేశం ప్రపంచ పటంలో నిలదొక్కుకోవాలంటే ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో అధికారిక సభ్యత్వం తీసుకోవాలి. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు, విదేశాల్లో రాయబార కార్యాలయాల ఏర్పాటు చేయాలి. గ్లోబల్ ట్రావెల్ కోసం పాస్‌పోర్ట్‌కు అంతర్జాతీయ గుర్తింపు కలిగి ఉండాలి. ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ స్విఫ్ట్ వంటివి లో భాగస్వామ్యం, వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలి. ఈ అన్ని రంగాల్లో బలూచ్ నాయకత్వం అంతర్జాతీయ సమాజాన్ని ఎలా ఒప్పిస్తుంది.. ఎంతవరకు విజయవంతమవుతుందనేది భవిష్యత్తులో తేలనుంది.
ప్రపంచ దేశాల వైఖరి ఏమిటి?
మరోవైపు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఈ ప్రకటనపై ఎలాంటి వైఖరి అవలంబిస్తాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఏ దేశమైనా మరొక కొత్త దేశానికి అధికారికంగా గుర్తింపు ఇవ్వాలంటే రాజకీయ, దౌత్య, అంతర్జాతీయ చట్టపరమైన అంశాలతో పాటు తమ సొంత భౌగోళిక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ 'రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్' ప్రకటనకు తక్షణ అంతర్జాతీయ గుర్తింపు లభించే అవకాశాలు చాలా పరిమితంగానే ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
ఏదేమైనా పాకిస్తాన్ సార్వభౌమాధికారంలో ఉన్న ప్రాంతంలో తిరుగుబాటుదారులు స్వతంత్ర దేశాన్ని ప్రకటించడం సాధారణ విషయం కాదు. ఇది బలూచిస్తాన్‌లో కొనసాగుతున్న తీవ్ర అసంతృప్తిని, మానవ హక్కుల ఉల్లంఘనలను, పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అంతర్గత భద్రతా లోపాలను మరోసారి ప్రపంచ దృష్టికి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ ప్రకటనకు అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుంది, దీనిని అణచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేదే ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.