'మావిగన్' మాయను ఎండగట్టండి: ఎంపీలకు బాబు దిశానిర్దేశం
సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీడీపీ ఎంపీలకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీడీపీ ఎంపీలకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సమస్యలను పార్లమెంటు వేదికగా ప్రస్తావించాలన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టేందుకు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ప్రయత్నించాలని సూచించారు. అలాగే, పోలవరం, అమరావతి రాజధానికి సంబంధించిన నిధుల విషయాన్ని కూడా ప్రత్యేకంగా సభలో చర్చకు వచ్చేలా చూడాలని కోరారు. శనివారం సాయంత్రం పార్టీ ఎంపీలతో ఉండవల్లిలోని నివాసంలో ప్రత్యేకంగా చంద్రబాబు చర్చించారు.
జగన్ దురుద్దేశం..
వైసీపీ అధినేత జగన్ రాజధాని అమరావతిపై పన్నిన కుట్రను పార్లమెంటులో ప్రధానంగా ప్రస్తావించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. పార్లమెంటు యావత్తు.. రాజధానికి అనుకూలంగా బిల్లును పాస్ చేసిందన్న ఆయన.. ఇప్పుడు పార్లమెంటు నిర్ణయాన్ని సైతం తోసిపుచ్చి.. ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటును కూడా అవమానించేలా మావిగన్ పేరుతో పన్నిన కుట్రను పార్లమెంటులో చర్చకు పెట్టాలని.. తద్వారా జాతీయ పార్టీల దృష్టికి కూడా తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. మావిగన్ కుట్రలను తిప్పికొట్టేందుకు.. ప్రతి ఒక్కరినీ కలిసి వివరించాలని పేర్కొన్నారు.
అదేసమయంలో వైసీపీ ఎంపీల వాదనలకు బలంగా ఎదురుదాడి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు సమావేశాల సమయంలో అందరూ హాజరుకావాలని.. ఇతరత్రా పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని కొందరికి సూచించా రు. అలానే.. పార్లమెంటు నియోజకవర్గాల సమస్యలను కూడా ప్రస్తావించి నిధులు తెచ్చుకునే బాధ్యత పూర్తిగా ఎంపీలపైనే ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని.. వీటిని మరింతగా ప్రోత్సహించేందుకు ఉన్న అన్ని అంశాలపైనా పార్లమెంటులో చర్చ జరిగేలా, రాష్ట్రానికి హరిత పరిశ్రమలు వచ్చేలా చూడాలన్నారు.
బిల్లులకు ఆమోదం..
వర్షాకాల పార్లమెంటు సమవేశాల్లో మహిళా బిల్లు, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, జమిలి ఎన్నికల బిల్లులు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. టీడీపీ తరఫున ఆయా బిల్లులను తప్పకుండా ఆమోదించాలని.. కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అదేసమయంలో కేంద్రం తీసుకువచ్చే ఇతరత్రా బిల్లులకు కూడా రాజ్యసభలోనూ ఆమోదం తెలపాల్సిన బాధ్యత ఉందన్నారు. పార్లమెంటు సభ్యులు సరైన సమాచారం, పక్కా ఆధారాలతో సభకు హాజరవ్వాలని, సమస్యలపై స్పందించాలని ఆయన పేర్కొన్నారు.