అంతరిక్షంలోకి విక్రమ్-1.. లేఖ పంపిస్తున్న మోడీ
హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన ఈ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ -1 ద్వారా.. కేవలం పోస్టు కార్డులను అంతరిక్షానికి పంపించనున్నారు. విక్రమ్-1 ఈ పోస్టు కార్డులను అంతరిక్షంలో జార విడవనుంది.
'మిషన్ ఆగమన్' పేరుతో ఓ ప్రైవేటు సంస్థ రూపొందించిన ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1 శనివారం అంతరిక్షంలోకి అడుగు పెట్టనుంది. తిరుపతి జిల్లాలోని శ్రీహరి కోట నుంచి శనివారం ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన ఈ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ -1 ద్వారా.. కేవలం పోస్టు కార్డులను అంతరిక్షానికి పంపించనున్నారు. విక్రమ్-1 ఈ పోస్టు కార్డులను అంతరిక్షంలో జార విడవనుంది.
ఎందుకు?
దేశ అంతరిక్ష రంగంలో దాదాపు 70 ఏళ్లకు పైగా సేవలు అందించిన వారి పేర్లు, వారి సేవలను వివరిస్తూ.. అనేక మంది ప్రముఖులు ఈ లేఖలు రాశారు. ఇప్పటి వరకు అంతరిక్షంలో కేవలం చైనాకు సంబంధించిన పలు వస్తువులు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ నుంచి ఈ తరహా ప్రయోగం చేయడం ఇదే తొలిసారి. అంతరిక్ష రంగంలో సేవలు అందించిన వారి గౌరవార్థం.. తొలిసారి ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో వేలాది మంది అనుభవాలను తమతో పంచుకున్నట్టు స్కైరూట్ ఏరోస్పేస్ తెలిపింది.
ప్రధాని సైతం..
ఈ లేఖ అంతరిక్ష యాత్రలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాలు పంచుకున్నారు. ఆయన స్వహస్తాలతో రాసిన లేఖను స్కైరూట్ ఏరోస్పేస్ కు పంపించారు. దీనిని శనివారం పంపనున్న విక్రమ్-1 ఆర్బిటాల్ రాకెట్‌లో ప్రత్యేకంగా పంపించనున్నారు. ఇతర లేఖలతో పాటు కాకుండా.. దీనిని ప్రత్యేకంగా ప్యాక్ చేసినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ''ప్రధాని మోడీ అంటేనే ప్రత్యేకం. ఇక, ఆయన రాసిన లేఖ కూడా మాకు ప్రత్యేకం'' అని వ్యాఖ్యానించారు. అందుకే ప్రధాని రాసిన లేఖను ప్రత్యేకంగా పంపనున్నట్టు తెలిపారు.
ఏం రాశారు!
ప్రధాని మోడీ తాను రాసిన లేఖను తన మదర్ టంగ్ గుజరాతీలో రాశారు. దీనిపై కేవలం 'వందేమాతరం' అని రాసి దాని కింద ఆయన సంతకం చేశారు. ఈ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. ఇక, ఈ లేఖల అంతరిక్ష యాత్రలో మాజీ ఇస్రో ఛైర్మన్‌లు, భారతీయ వ్యోమగాములు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు రాసిన లేఖలను గగనంలోకి పంపించనున్నారు. అలాగే, మైక్రోఆర్టిస్ట్ కళాకారుడు అజయ్ కుమార్ 18 క్యారెట్ల బంగారంతో రూపొందించిన చిన్న రాకెట్ ను కూడా దీని ద్వారా అంతరిక్షానికి పంపించనున్నారు.