చల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు.. అసలేం జరిగింది?
క్రిష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకున్న పేలుడు తీవ్రత షాకింగ్ గా మారింది.;
క్రిష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకున్న పేలుడు తీవ్రత షాకింగ్ గా మారింది. ఎస్ఐ.. ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలకు గురైన ఈ ఉదంతంలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. పేలుడు ఇంత తీవ్రత ఉండటానికి కారణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మందుగుండు సామాగ్రి పేలటమే కారణంగా చెబుతున్నారు. సీజ్ చేసిన టపాసులు కోర్టుకు తరలిస్తున్న వేళలో పేలుడు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసు జీపు స్వల్పంగా ధ్వంసం కాగా.. గాయపడిన పోలీసుల్ని ఆసుపత్రికి తరలించారు. మందు గుండు సామాగ్రిని స్టేషన్ లోకి తీసుకొచ్చి పరిశీలిస్తున్న సమయంలోనే పేలుడు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
పేలుడు ధాటికి స్టేషన్ లోపలి ఫర్నీచర్ తో పాటు.. స్టేషన్ బయట నిలిపి ఉంచిన వాహనాలు సైతం దెబ్బ తినటం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే..చల్లపల్లి సీఐ ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. పేలుడు కారణాల్ని ఆరా తీస్తున్నారు. ఈ ఉదంతం గురించి ఏపీ హోం మంత్రి అనిత స్పందించారు.వెంటనే జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారు. గాయాల బారిన పోలీసులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.ఈ ఉదంతం స్థానికంగా పెను సంనలంగా మారింది.