డీలిమిటేషన్ డౌట్స్.. మహిళా రిజర్వేషన్స్ తో లింకు.. ఎన్డీఏ అసలు ప్లాన్ ఏంటి?
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పట్టాలెక్కే అంశంపై విస్తృత చర్చ సాగుతోంది.;
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పట్టాలెక్కే అంశంపై విస్తృత చర్చ సాగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం విభజన చేయాలని ప్రతిపాదించడంతోపాటు పునర్విభజనకు మహిళా రిజర్వేషన్లను లింకు పెట్టడం ఆసక్తికరంగా మారింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రతిపాదనలకే పరిమితమైన మహిళా రిజర్వేషన్లను పునర్విభజన ప్రక్రియతో కలిపి ముందుకు తీసుకురావడంతో కేంద్రం ఈ బిల్లులను ఎలా గట్టెక్కిస్తుందా? అన్న అనుమానాలకు తెరలేపుతోంది.
విపక్షాల వ్యతిరేకత
మహిళా రిజర్వేషన్లు, పునర్విభజనకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాల్సివుంది. దీంతో గురువారం నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నారు. దేశంలో ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం, 2011 జనగణన ఆధారంగా డీలిమిటేషన్ చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తుండటంతో విపక్షాలు వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో బిల్లుల ఆమోదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగ సవరణకు 364 మంది ఎంపీల ఓట్ల అవసరం కాగా, ఎన్డీఏకి ప్రస్తుతం 293 మంది సభ్యుల బలమే ఉంది.
ధీమాగా కేంద్రం
అయితే బిల్లుల ఆమోదంపై కేంద్రం ధీమాగా ఉంది. దీనికి ప్రధాన కారణం మహిళా రిజర్వేషన్ బిల్లును ఏ పార్టీ వ్యతిరేకించలేదన్న భావనే అంటున్నారు. మహిళా రిజర్వేషన్లకు ఆమోదిస్తే ఆటోమెటిక్ గా డీలిమిటేషన్ ప్రక్రయ ముందుకు సాగిపోతుందని, ఒకవేళ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే మహిళా రిజర్వేషన్ అమలు సాధ్యమయ్యే పరిస్థితి లేదని అంటున్నారు. కేంద్రం వ్యూహాత్మకంగా ఈ రెండింటికి ముడిపెట్టడంతో విపక్షాలు ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నాయని అంటున్నారు.
పక్కా వ్యూహం
మొత్తానికి కేంద్రం పకడ్బందీ వ్యూహంతోనే నారీ శక్తి వందన్ అధినియం (మహిళా రిజర్వేషన్) బిల్లును ప్రవేశపెడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రతిపాదన దశలోనే బుట్టదాఖలు అవుతున్న మహిళా రిజర్వేషన్లు కార్యరూపం దాల్చనున్నాయని అంచనా వేస్తున్నారు. తొలిసారిగా 1996లో మాజీ ప్రధాని దేవెగౌడ ప్రభుత్వం 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని చూసింది. అయితే అప్పట్లో బిల్లును గీతా ముఖర్జీ కమిటీ పరిశీలనకు పంపడం, ఆపై లోక్‌సభ రద్దు కావడంతో ఆ బిల్లు వీగిపోయింది.
ఎన్నో ప్రయత్నాలు
అనంతరం 1998, 1999లో దివంగత నేత వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్డీయే ప్రభుత్వం హయాంలో రెండుసార్లు బిల్లు తెచ్చినప్పటికీ, సభలో తీవ్ర గందరగోళం, సభ్యుల నిరసనల మధ్య ఆమోదం పొందలేదని గుర్తుచేస్తున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2008లో ఒకసారి 2010లో మరోసారి మహిళా రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేసింది. కానీ, లోక్‌సభలో రాజకీయ ఏకాభిప్రాయం లేకపోవడంతో అది అక్కడే నిలిచిపోయింది. ఈ పరిస్థితులు గమనించిన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పక్కా రాజకీయ వ్యూహంతో డీలిమిటేషన్ బిల్లుకు జతచేసి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం ఆసక్తికర అంశంగా మారిందని అంటున్నారు. రాజ్యాంగ సవరణకు అవసరమైన బలం లేకపోయినా కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ బిల్లులు ఎలా గట్టెక్కుతాయనేది తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోందని చెబుతున్నారు.