టెక్సాస్ కు భారీ వర్షాల షాక్.. 24 మంది దుర్మరణం
కట్ చేస్తే.. తాజాగా టెక్సాస్ రాష్ట్రాన్ని మాయదారి వర్షాలు ముంచెత్తుతున్నాయి భారీగా కురుస్తున్న వర్షాలకు ఆ రాష్ట్రం ఆగమాగం అవుతోంది.;
ప్రపంచాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నట్లుగా.. తరచూ పరిమితుల పేరుతో ఒక ఆట ఆడుకుంటున్న అగ్రరాజ్యం అమెరికాకు అడ్డే లేదన్నట్లుగా పరిస్థితులు ఉంటాయి. అయితే.. ఆ కొరతను ప్రకృతి తీర్చేస్తుంటుంది. అప్పుడప్పుడు ఆ దేశానికి ప్రకృతి విసిరే సవాళ్లకు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటుంది. ఆ మధ్యలో కార్చిచ్చు ఎంతలా ఇబ్బంది పెట్టిందో తెలిసిందే. కట్ చేస్తే.. తాజాగా టెక్సాస్ రాష్ట్రాన్ని మాయదారి వర్షాలు ముంచెత్తుతున్నాయి భారీగా కురుస్తున్న వర్షాలకు ఆ రాష్ట్రం ఆగమాగం అవుతోంది.
మాయదారి వర్షాల కారణంగా ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోతే.. మరో 20 మందికి పైనే బాలికలు గల్లంతైన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో టెక్సాస్ లోని హంట్ ప్రాంతంలో గ్వాడాలుపే నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి.
రోడ్ల మీదకు పెద్ద ఎత్తున వరద నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలతో చిక్కుకుపోయిన దాదాపు 200 మందిని సేవ్ చేశారు. ఇదిలా ఉంటే గ్వాడాలుపే నదీ తీరంలో ఒక ప్రముఖ క్రిస్టియన్ క్యాంప్ లో సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనూహ్య వరదల కారణంగా 25 మంది వరకు బాలికలు మిస్ అయినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో వీరి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
వీరి ఆచూకీ కోసం సోషల్ మీడియాలోనూ పెద్ద డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అధికారులు పడవలు.. హెలికాఫ్టర్లను రంగంలోకి దించారు. వీరి ఆచూకీ కోసం పెద్ద ఎత్తున సహాయక టీంలను ఏర్పాటు చేశారు. అయినా ఇప్పటికి సానుకూల ఫలితం ఏదీ వెలువడలేదు.