కల్తీ నెయ్యి కేసులో వైవీపై ప్రశ్నల వర్షం.. సిట్ అధికారులకు ఏం చెప్పారంటే?
ప్రధానంగా కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్నను సీబీఐ సిట్ అరెస్టు చేసింది.;
వైసీపీ కీలక నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని టీటీడీకి కల్లీ నెయ్యి సరఫరా కేసులో సీబీఐ సిట్ విచారించింది. అనారోగ్య కారణాలతో తాను తిరుపతి రాలేనని సుబ్బారెడ్డి ఇచ్చిన సమాచారంతో సిట్ అధికారులు హైదరాబాదులో ఆయన ఇంటికే వచ్చి వాంగ్మూలం తీసుకున్నారు. గురువారం సుమారు 7 గంటల పాటు ఈ విచారణ జరగగా, సుబ్బారెడ్డి పలు విషయాలపై తన వాదన వినిపించారు. 2019 నుంచి 2023 వరకు సుబ్బారెడ్డి టీటీడీ చైర్మనుగా పనిచేశారు. ఆ సమయంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్ల ఎంపికపై ఆయన నుంచి సిట్ సమాచారం సేకరించింది. అదేవిధంగా సుబ్బారెడ్డి ఇంట్లో టీటీడీకి సంబంధించిన కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుందని చెబుతున్నారు.
ప్రధానంగా కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్నను సీబీఐ సిట్ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఈ కేసులో సుబ్బారెడ్డి పాత్రపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఓ వర్గం మీడియా కథనాలు వెల్లడించింది. ఇదే విషయంపై టీటీడీ మాజీ చైర్మన్ సిట్ విచారణ తర్వాత స్పందించారు. కల్తీ నెయ్యి కేసులో అరెస్టు అయిన నిందితుడు చిన్న అప్పన్న తన పీఏ కాదని స్పష్టం చేశారు. అతడు 2018లోనే తనవద్ద మానేశాడని, 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ భవన్ లైజన్ ఆఫీసురుగా చేరినట్లు తనకు తెలుసని వివరించారు. ఇక తన వద్ద పీఏగా మానేసిన తర్వాత చిన అప్పన్న అప్పట్లో తమ పార్టీలో ఉన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వద్ద కొద్దికాలం, తెలంగాణకు చెందిన మరో ఎంపీ వద్ద మరికొద్ది కాలం పనిచేసినట్లు సుబ్బారెడ్డి వివరించారు.
ఇక కల్తీ నెయ్యి కేసుపై తనకేమీ తెలియదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో చిన్న అప్పన్న పాత్రపై ఏమైనా ఆధారాలు ఉంటే అతడిపై చర్యలు తీసుకోవచ్చని తేల్చిచెప్పారు. చిన్న అప్పన్నకు హవాలా మార్గంలో డబ్బు అందిందని చెబుతున్నారని, అదే నిజమైతే విచారణ జరిపి చర్యలు తీసుకోమని సూచించారు. అంతేకాకుండా ఆయన అలా వ్యవహరించడానికి కారణమైన టీటీడీ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నెయ్యి సరఫరా కాంట్రాక్టర్లు 2019 నుంచి మారారని చెబుతున్నారని.. కానీ ఈ విషయంపై 2014 నుంచి కూడా విచారణ చేపట్టాలని వైవీ కోరారు.
మొత్తానికి వైసీపీని తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారణ సాఫీగా ముగిసింది. దీంతో ఆ పార్టీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ మొత్తం 24 మందిపై కేసు నమోదు చేసింది. ఇందులో 9 మంది నిందితులను అరెస్టు చేసింది. మరోవైపు అప్పట్లో టీటీడీ చైర్మన్, ఈవోగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిని విచారించింది. ధర్మారెడ్డి, వైవీ మాజీ పీఏ చిన్న అప్పన్న వాంగ్మూలం ఆధారంగా వైవీని ప్రశ్నించింది. ఈ విచారణలో నెయ్యి కాంట్రాక్టర్ల ఎంపిక విషయం అధికారులదని వైవీ వాంగ్మూలమివ్వడంతో సిట్ నెక్ట్స్ స్టెప్ ఏంటన్నది సస్పెన్స్ గా మారింది.