ఇప్పుడు తనయుడి వంతు... అన్మోల్ అంబానీపై సీబీఐ కేసు, ఇంట్లో సోదాలు!

ముంబై లోని బ్రాంచ్ నుంచి ఆర్.హెచ్.ఎఫ్.ఎల్. కంపెనీ రూ.450 కోట్లు రుణంగా తిసుకుని, తిరిగి చెల్లించడంలో విఫలమైంది.;

Update: 2025-12-09 14:53 GMT

ఇప్పటికే అక్రమ నగదు బదిలీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూపు ఛైర్మన్ అనిల్ అంబానీకి మరో షాక్ తగిలింది! బ్యాంకుల నుంచి రూ.వందల కోట్లు రుణాలుగా తీసుకుని వాటిని ఇతర మార్గాలకు మళ్లించారనే ఆరోపణలపై సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న వేళ.. ఆయన కుమారుడు అన్మోల్ అంబానీపైనా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది.

అవును... అనిల్ అంబానీ తనయుడు అన్మోల్ అంబానీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూ.228 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలపై అన్మోల్ అంబానీ, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, మాజీ సీఈఓ రవీంద్ర శరద్ సుధాకర్ లపై గతంలో బ్యాంకు (నాడు ఆంధ్రా బ్యాంక్) ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా స్పందించిన సీబీఐ ప్రతినిధి ఒకరు... ముంబైలోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి న్యాయస్థానం నుంచి సెర్చ్ వారెంట్లు పొందిన సీబీఐ.. డిసెంబర్ 9 - 2025న ముంబైలోని రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్.హెచ్.ఎఫ్.ఎల్) రెండు అధికారిక క్యాంపస్ లు, అప్పటి ఆర్.హెచ్.ఎఫ్.ఎల్ డైరెక్టర్ అన్మోల్ అంబానీ నివాస ప్రాంగాణాలు, ఆ సంస్థ మాజీ సీఈవో, ఫుల్ టైమ్ డైరెక్టర్ రవీంద్ర సుధాకర్ నివాస ప్రాంగణాల్లో సోదాలు ప్రారంభించినట్లు తెలిపింది.

ముంబై లోని బ్రాంచ్ నుంచి ఆర్.హెచ్.ఎఫ్.ఎల్. కంపెనీ రూ.450 కోట్లు రుణంగా తిసుకుని, తిరిగి చెల్లించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో.. 2016 ఏప్రిల్ నుంచి 2019 జూన్ 30 మధ్య ఆ సంస్థలో జరిగిన లావాదేవీలపై గ్రాంట్ థోర్నంటన్ ఆడిట్ సంస్థ ఫోరెన్సిక్ పరిశీలన చేపట్టింది. ఇందులో.. రుణంగా తీసుకున్న మొత్తాన్ని ఇతర అవసరాలకు వినియోగించినట్లు గుర్తించింది.

ఈ నేపథ్యంలోనే... రుణగ్రహీత కంపెనీ మునుపటి ప్రమోటర్లు / డైరెక్టర్ల హోదాలో నిందితులు ఖాతాలను తారుమారు చేయడం, నిధులను మోసపూరితంగా దుర్వినియోగం చేయడంతో పాటు ఆర్ధిక సహాయం అందించిన ప్రయోజనం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం నిధులను మళ్ళించడం చేశారని బ్యాంక్ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ రంగంలోకి దిగింది!

Tags:    

Similar News