రేవంత్‌కు రెస్ట్ ఉండదా? జనం టాక్ ఏంటంటే
క్షణం తిరిక లేకుండా.. ప్రజలను కలుసుకున్నారు మీడియా సమావేశాలు, ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇలా.. అనేక కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపేశారు;
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి.. రెస్ట్ ఉంటుందా? దాదాపు 50 రోజులుగా ఆయన అలుపెరుగకుండా.. రాష్ట్రంలో ప్రచారం చేశారు. క్షణం తిరిక లేకుండా.. ప్రజలను కలుసుకున్నారు మీడియా సమావేశాలు, ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇలా.. అనేక కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపేశారు. ఇక, ఇప్పుడు ఎన్నికలయ్యాయి. ఫలితం వచ్చేసింది. కాంగ్రెస్ గద్దెనెక్కేసింది.
దీంతో రేవంత్‌కు రెస్టు దొరికినట్టేనని అందరూ భావించొచ్చు. కానీ, అసలు సిసలు కష్టం.. అంతా కూడా ఇప్పుడే ఉందని అంటున్నారు పరిశీలకులు. మరో మూడు మాసాల్లో పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి. ఇది చాలా తక్కువ సమయం. అయితే.. ప్రజలు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తోందనే చర్చ చేయడానికి.. పనితీరు చూడడానికి మాత్రం చాలా ఎక్కువ సమయమే! మరోవైపు.. తమ ప్రభుత్వం కూలిపోయిందన్న ఆవేదనలో ఉన్న కేసీఆర్.. మరింత వ్యూహంతో పార్లమెంటు ఎన్నికల్లో దండెత్తే ప్రయత్నాలు చేస్తారు.
దీంతో ఆయన వ్యూహాలకు ప్రతివ్యూహాలు వేయాల్సిన అవసరం రేవంత్‌పైనే ఉంటుంది. ఇక, ఆరు గ్యారెంటీల్లో కీలకమైన బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలెండర్లు, ప్రతి మహిళకు రూ.2500 సాయం, రైతు బంధు కార్యక్రమం కింద తక్షణం 15000 ఇచ్చే అంశాలకు రేవంత్ పెద్దపీట వేయడమే కాకుండా.. వెంటనే అమలు చేయాలి. అయితే.. ఇదేమీ రాత్రికి రాత్రి అయ్యే పనికాదు. అంతేకాదు.. ఆయా అంశాలపై సుదీర్ఘ ఆలోచన చేయాలి. మంతనాలు చేయాలి. అలాగని నెలల తరబడి వెయిట్ చేసే పరిస్తితి కూడా లేదు.
వెంటనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలోకనీసంలో కనీసం 10 చోట్లయినా.. పార్టీని గెలిపించాలి. ఇక, పార్టీ కార్యకర్తలపై పెట్టిన కేసులను ఉపసంహరించడమా.. లేక.. ఏం చేయాలనే విషయంపైనా దృష్టిపెట్టాలి. ఇవన్నీ చేయడానికి ఇప్పుడున్న సమయం సరిపోదు. సో.. మొత్తానికి రేవంత్ పూర్తి కాలం పనిచేయా ల్సిందే. దీంతో ఆయనకు రెస్ట్ ఉండదని అంటున్నారు పరిశీలకులు. ఇవన్నీ ఇలా ఉంటే.. అంతర్గతకుమ్ములాటలు లేకుండా కూడా చూసుకోవాల్సి ఉంది.