ఖలీస్థానీ ఉద్యమంతో దేశ భద్రతకే ముప్పు.. కెనడా ప్రభుత్వానికి ఇంటల్ వార్నింగ్..

అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో నిన్నటి మిత్రులే నేడు శత్రువులుగా మారవచ్చు, అలాగే నిన్నటి వరకు ఉపేక్షించిన అంశాలే నేడు ఉనికికే ప్రమాదంగా పరిణమించవచ్చు.;

Update: 2026-05-04 04:46 GMT

అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో నిన్నటి మిత్రులే నేడు శత్రువులుగా మారవచ్చు, అలాగే నిన్నటి వరకు ఉపేక్షించిన అంశాలే నేడు ఉనికికే ప్రమాదంగా పరిణమించవచ్చు. ఒకప్పుడు వేర్పాటువాద గళాలకు ఆశ్రయమిచ్చి, భావప్రకటన స్వేచ్ఛ పేరుతో వారిని వెనకేసుకొచ్చిన ఒక దేశం, అవే గళాలు తమ దేశ భద్రతకే గొడ్డలిపెట్టు అని భావించడం గమనార్హం. కెనడా గడ్డపై పాతుకుపోయిన కొన్ని శక్తులు కేవలం ఒక వర్గానికో లేదంటే ఒక ప్రాంతానికో పరిమితం కాకుండా, దేశ ప్రభుత్వ యంత్రాంగాన్నే తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్న చేదు నిజాన్ని ఆ దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బయటపెట్టింది.

నిఘా వర్గాల సంచలన హెచ్చరిక..

కెనడా ఇంటెలిజెన్స్ ఇటీవల విడుదల చేసిన అంతర్గత నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖలిస్థానీ అనుకూల సంస్థలు కెనడాలో తమ ఉనికిని నిరసనలకే పరిమితం చేయకుండా, హింసాత్మక, తీవ్రవాద అజెండాను ప్రచారం చేసేందుకు ఆ దేశ ప్రభుత్వ వ్యవస్థలనే వాడుకుంటున్నాయని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండే వెసులుబాటును అడ్డం పెట్టుకొని, ఈ సంస్థలు తమ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని కీలక నిర్ణయాధికార సంస్థల్లోకి చొరబడడం ద్వారా తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేశ భద్రతా ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని నివేదికలో పేర్కొన్నారు.

జాతీయ భద్రతకు పెను సవాల్

ఇన్నాళ్లూ వేర్పాటువాద కార్యకలాపాలపై మౌనం వహించిన కెనడా, ఇప్పుడు అధికారికంగా ఖలిస్థానీలను నేషనల్ సెక్యూరిటీకి ముప్పుగా ప్రకటించింది. వీరి కార్యకలాపాలు విదేశీ వ్యవహారాలకు సంబంధించినవి మాత్రమే కాదని, నేరుగా కెనడియన్ల ప్రయోజనాలకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని ఇంటలీజెన్స్ గుర్తించింది. తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం, నిధుల సేకరణ హింసను ప్రోత్సహించడం వంటి చర్యల వల్ల సామాన్యుల భద్రత గాలిలో దీపంలా మారుతోందని ఇంటల్ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ పరిణామం అంతర్గత భద్రతా విధానంలో ఒక పెద్ద మలుపుగా భావించవచ్చు.

రాజకీయ మార్పుపై ప్రభావం

కెనడా రాజకీయాల్లో వచ్చిన పెను మార్పులు ఈ కొత్త వైఖరికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. గతంలో ఖలిస్థానీ అనుకూల ధోరణిని అవలంబించారనే విమర్శలు ఎదుర్కొన్న ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేసిన తర్వాత, అక్కడ ప్రభుత్వ తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కొత్త నాయకత్వం దేశ ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యతిస్తూ, దౌత్య సంబంధాలను పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఓటు బ్యాంకు రాజకీయాల కంటే దేశ భద్రతే ముఖ్యమని భావిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం, వేర్పాటువాద శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకోవడం ఈ మార్పులకు సంకేతంగా నిలుస్తోంది.

వ్యవస్థలపై పెరుగుతున్న పట్టు

తీవ్రవాద సంస్థలు ప్రభుత్వ విభాగాల్లోకి చొరబడడం ఒక రోజులో జరిగింది కాదు. ఏళ్ల తరబడి పక్కా ప్రణాళికతో జరుగుతుందన్న కుట్రను కెనడా నిఘా వర్గాలు ఇప్పుడు సాక్ష్యాధారాలతో విశ్లేషించాయి. ఈ సంస్థలు హింసాత్మక ప్రచారాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు సోషల్ మీడియా, విద్యా సంస్థలు, స్థానిక రాజకీయ వేదికలను అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఇలాగే కొనసాగితే కెనడా ప్రజాస్వామ్య పునాదులే కదిలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, ఇప్పుడు కఠిన నిర్ణయాలు దేశ సమగ్రతను కాపాడుకోవడానికి అత్యవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

సరికొత్త సమీకరణాలు

కెనడా ప్రభుత్వ ప్రస్తుత వైఖరి అంతర్జాతీయ స్థాయిలో.., ముఖ్యంగా భారత్‌తోని సంబంధాలపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. గతంలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గి, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకునే వాతావరణం ఏర్పడుతోంది. వేర్పాటువాదాన్ని ఏ రూపంలోనైనా అణిచివేయాలనే సంకల్పంతో కెనడా ముందుకు రావడం ఆ దేశ భవిష్యత్తుకే కాకుండా, ప్రపంచ శాంతికి కీలకం. రాబోయే రోజుల్లో ఈ దిశగా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి కెనడా తన తప్పును తెలుసుకుని, భద్రత విషయంలో మేల్కొనడం ఒక శుభపరిణామం.

Tags:    

Similar News