కెనడాపై కొంచెం చల్లారిన ట్రంప్.. ఏమన్నారంటే.?

అంతర్జాతీయ రాజకీయాల్లో మాటలకు, ప్రకటనలకు వేట్ ఉంటుంది. దానిని లెక్కచేయకపోతే చిన్న తప్పిదం కూడా దేశాల మధ్య దౌత్య గందరగోళానికి దారి తీస్తుంది.;

Update: 2025-11-03 21:30 GMT

అంతర్జాతీయ రాజకీయాల్లో మాటలకు, ప్రకటనలకు వేట్ ఉంటుంది. దానిని లెక్కచేయకపోతే చిన్న తప్పిదం కూడా దేశాల మధ్య దౌత్య గందరగోళానికి దారి తీస్తుంది. కెనడా అదే పాఠం నేర్చుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహంతో ఉడికిపోవడంతో.. కెనడా ప్రధాన మంత్రి మార్క్‌ కార్నీ స్వయంగా ఫోన్‌ చేసి క్షమాపణ చెప్పారు.

ఒంటారియో ప్రభుత్వం విడుదల చేసిన ఒక నిమిషం వీడియో ప్రకటనలో.. అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్‌ రేగన్‌ 1987లో చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలను ఉపయోగించారు. ఆ ప్రకటనలో ఆ మాటలను ‘వాణిజ్య నిరోధాలకు వ్యతిరేకంగా’ చూపించారు. కానీ రేగన్‌ ఫౌండేషన్‌ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రేగన్‌ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన భావాన్ని వక్రీకరించారు అని ప్రకటించింది. ఇదే వార్త ట్రంప్‌ చెవిన పడింది. ఆయన వెంటనే ఆ ప్రకటనను ‘అసత్యం’ అని రేగన్‌ నిజానికి టారిఫ్‌లకు మద్దతుదారుడని అన్నారు. దీంతో అమెరికా–కెనడా మధ్య వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి.

చిన్న ప్రకటన పెద్ద బరువు..

మార్క్‌ కార్నీ వ్యక్తి గతంగా ట్రంప్‌కు క్షమాపణ చెప్పారు. ట్రంప్‌ కూడా ఆ విషయాన్ని అంగీకరించారు. అయినా ఆయన వ్యాఖ్యలు స్పష్టంగా అసంతృప్తిని కలిగించాయి. ‘ప్రకటన తప్పు కానీ కార్నీతో సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి’ అన్నారు. అంటే, సంబంధాలు బాగున్నా, అపార్థం మాత్రం తొలగలేదన్నమాట. అంతర్జాతీయ వేదికపై ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. దేశాల మధ్య సంబంధాలు కేవలం ఒప్పందాలపైనే కాకుండా, పరస్పర గౌరవంపైన కూడా ఆధారపడతాయి.

ఒంటారియో సీఎం డగ్‌ ఫోర్డ్‌ మొదట ఆ ప్రకటనను సమర్థించారు. ‘మా ఉద్దేశ్యం అమెరికాను దెబ్బతీయడం కాదు, స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించడం మాత్రమే’ అన్నారు. కానీ ఒత్తిడి పెరగడంతో చివరకు ప్రచారాన్ని నిలిపేశారు. అంతవరకు ఆ ప్రకటన వరల్డ్‌ సిరీస్‌ ప్రసారాల సమయంలో కూడా ప్రసారమవుతుండడంతో వివాదం మరింత ముదిరింది.

వాణిజ్య వివాదాల వెనుక..

ఈ ఘటన ఒక పెద్ద సందేశం ఇస్తోంది. వాణిజ్య ఒప్పందాలకంటే, ప్రతిష్టా, జాతీయ గర్వం, రాజకీయ ప్రతీకలు అంతే ముఖ్యమని సందేశం. అమెరికా–కెనడా మధ్య టారిఫ్‌ల వివాదం కొత్తది కాదు. కానీ ఈ సారి భావోద్వేగ స్థాయికి చేరింది. అమెరికా రాజకీయ చరిత్రలో రేగన్‌ ఒక ప్రతీకాత్మక నాయకుడు. ఆయన మాటలను వాణిజ్య ప్రచారంలో ఉపయోగించడం అమెరికా జాతీయ గౌరవంపై దాడిగా ట్రంప్‌ భావించారు. అదే ఆగ్రహానికి దారి తీసింది.

ప్రకటనల ప్రపంచంలో ‘క్రియేటివ్‌ ఫ్రీడమ్‌’ ఎంత ఉంటుందో.. దౌత్య ప్రపంచంలో ‘రాజకీయ బాధ్యత’ అంతే ఉంటుంది. ఒక మాట, ఒక ఇమేజ్‌, ఒక వాఖ్య కూడా దేశాల మధ్య యుద్ధానికి కారణం కావచ్చు. కార్నీ క్షమాపణతో ఈ తుఫాన్‌ కొంత శాంతించిందనే చెప్పాలి. కానీ ఈ ఘటన భవిష్యత్‌లో ప్రతి దేశానికి ఒక పాఠం నేర్పుతోంది.

Tags:    

Similar News