రేపల్లె మంత్రిగారి మీద వైసీపీ స్కెచ్ !

ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె రాజకీయంగా కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం. అసలే రాజకీయ చైతన్యం అధికంగా ఉన్న జిల్లా గుంటూరు.

Update: 2026-06-16 03:38 GMT

ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె రాజకీయంగా కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం. అసలే రాజకీయ చైతన్యం అధికంగా ఉన్న జిల్లా గుంటూరు. అలాంటి చోట రేపల్లె ఉంది. ఇక్కడ హ్యాట్రిక్ పరాజయం అందుకుంది వైసీపీ దాంతో కసిగా పనిచేసి అయినా 2029 ఎన్నికల్లో గెలిచి తీరాలని అనుకుంటోంది. రేపల్లెలో టీడీపీ మంచి పట్టు సాధించింది. గతంలో అయితే ఒక ఎన్నికలో టీడీపీ గెలిస్తే మరో ఎన్నికలో కాంగ్రెస్ గెలిచేది. కానీ వరసగా మూడు ఎన్నికల నుంచి అనగాని సత్యప్రసాద్ గెలిచి వస్తున్నారు. ఏపీలోని కూటమి మంత్రివర్గంలో ఆయన రెవిన్యూ శాఖ మంత్రిగా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనగానికి రేపల్లెలో తిరుగులేదని కూడా చెబుతూంటారు. అయితే మూడు పర్యాయాలు గెలిచి మంత్రిగా ఉన్న ఆయనని ఓడించేందుకు వైసీపీ భారీ స్కెచ్ గీస్తోంది అని అంటున్నారు.

వైసీపీ ఓటమి వెనక :

కాంగ్రెస్ లో ఒకసారి మాత్రమే రేపల్లె నుంచి మోపిదేవి వెంకటరమణ గెలిచారు. ఆయనకు వైఎస్సార్ మంత్రివర్గంలో స్థానం లభించింది. ఇక 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2019లో కూడా మోపిదేవి ఓడినా ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవిని కట్టబెట్టారు జగన్. అయితే శాసనమండలిని రద్దు చేయాలన్న కారణంతో ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. 2024లో మోపిదేవిని పక్కన పెట్టి ఈవూరి గణేష్ కి టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడింది. ఇక మోపిదేవి టీడీపీలో చేరిపోయారు.

ఆ రెండే కీలకం :

ఇక రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు సామాజిక వర్గాలు కీలకం అని అంటున్నారు. అందులో ఒకటి గౌడ, రెండవది కాపు. ఈ రెండు వర్గాల బలంతోనే ఎవరైనా గెలవాల్సి ఉంటుంది. ఇక్కడ గౌడ కులస్తులు 45 వేల వరకూ ఉంటే కాపులు 42 వరకూ ఉన్నారు. వైసీపీ ఇంతకాలం మత్స్యకారులకు టికెట్లు ఇస్తూ వచ్చింది. ఇపుడు రూట్ మార్చింది గౌడలను అక్కున చేర్చుకుంటూనే కాపులను చేరదీసింది. తాజాగా మోపిదేవి శ్రీనివాసరావుని వైసీపీ తమ పార్టీలోకి చేర్చుకుంది. ఆయనకు జగన్ స్వయంగా నేను అన్నీ చూసుకుంటాను అని మాట ఇచ్చారు. దాంతో వచ్చే ఎన్నికల్లో మోపిదేవి శ్రీనివాస్ కి టికెట్ దక్కుతుందంకి ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఇంఛార్జిగా ఉన్న గౌడ సామాజిక వర్గానికి చెందిన పీట నాగ మోహన క్రిష్ణ తో కాకుండా విడిగా మోపిదేవి జనంలోకి వెళ్తున్నారు. దాంతో రెండు వర్గాలుగా రేపల్లె వైసీపీ చీలిపోయింది అని అంటున్నారు.

వికటిస్తున్న ప్రయోగం :

వైసీపీ ఎపుడు ప్రయోగం చేసినా అది వికటిస్తోంది అని రేపల్లెలో పార్టీ నేతలు అంటున్నారు. నిజానికి పీటా నాగ మోహన్ క్రిష్ణ వచ్చాక వైసీపీ పుంజుకుంది. ఆయన అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇపుడు మోపిదేవి వచ్చాక పార్టీలో ఇద్దరు నేతలు కలుస్తారని అంతా భావించారు. కానీ రాజకీయంగా తానే సీనియర్ అని మోపిదేవి భావిస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఆయన సెపరేట్ గా జనంలో తిరుగుతున్నారు. ఆయన వర్గీయులు అయితే తమ నేతకే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ పరిణామాలతో పీటా వర్గం డీలా పడుతోంది. మొత్తానికి ఇద్దరు బలమైన నేతలను కలిపిస్తే ఈసారి మంత్రిని ఓడించవచ్చు అని స్కెచ్ గీసిన వైసీపీకి ఈ ఇద్దరు నేతల మధ్య గ్యాప్ కలవరం రేకెత్తిస్తోంది అని అంటున్నారు. మరి ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News