ఏంటీ బర్నవుట్ సిండ్రోమ్.. ఐటీ ఉద్యోగులే టార్గెట్!
రొట్టె మీద తేమలా వారి పరిస్థితి మారిపోయిందని అనుభవించిన నిపుణులు చెప్పుకొస్తున్నారు.;
బర్నవుట్ సిండ్రోమ్.. పని ఒత్తిడి.. మిగతా ప్రజలతో పోల్చుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఈ సమస్య బారిన ఎక్కువ పడుతున్నారని మానసిక నిపుణులు కూడా చెబుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. సాఫ్ట్వేర్ ఉద్యోగులు మంచి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. లక్షల్లో జీతం అందుకుంటారు.. వారికి పైగా వారానికి రెండు రోజులు సెలవులు.. వారిది హుందా లైఫ్ అంటూ ఇలా రోజుకొక మాట తరచూ వినిపిస్తూనే ఉంటుంది..అయితే ఆ ఐటి ఉద్యోగుల లగ్జరీ జీవితం వెనుక వారి మానసిక ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడం అసాధ్యం అనే చెప్పాలి
రొట్టె మీద తేమలా వారి పరిస్థితి మారిపోయిందని అనుభవించిన నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఉదయం లేచింది మొదలు అధిక పని ఒత్తిడి.. ట్రాఫిక్ తో యాతన .. ఉద్యోగ భద్రతపై ఆందోళన.. పని - వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యం లేకపోవడం .. ఇలా ఎన్నో కారణాలు మానసిక ఒత్తిడికి దారితీస్తున్నాయి. ఇలా మనిషిలో మానసిక ఒత్తిడి పెరిగి అది 'బర్నవుట్ సిండ్రోమ్'కి దారితీస్తోంది. ప్రతి పదిమంది ఐటి ఉద్యోగులలో ఏడుగురు ఈ సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు కూడా చెబుతున్నారు.. మరి ఏంటీ బర్నవుట్ సిండ్రోమ్ అంటే.. ఎక్కువ రోజులు ఒత్తిడితో బాధపడుతూ.. మానసిక, శారీరక అలసట, భావోద్వేగాలు అదుపులో ఉండకపోవడమే దీని లక్షణం.
ఇకపోతే ఈ బర్నవుట్ సిండ్రోమ్ ఏర్పడడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అధిక పని ఒత్తిడి, జీవన సమతుల్యత లోపించడం, మానసిక ఒత్తిడి, ఒంటరితనం, సాంకేతిక మార్పులు, సరికొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలనే ఒత్తిడి, అధిక జీవన వ్యయం కారణంగా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ భద్రతపై ఆందోళన, కుటుంబంలో సమస్యలు వంటి బోలెడు కారణాలు తారసపడతాయి.
అయితే వీటి నుండి బయటపడాలి అంటే మానసిక నిపుణులు కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
మానసిక ఒత్తిడిని మొదట తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎంత ఉద్యోగం చేసినా సరే రోజుల్లో కొన్ని గంటలు మనకంటూ కేటాయించుకోవాలి. నచ్చిన వారితో సమయాన్ని గడపాలి. రోజూ ఒకే సమయానికి నిద్రకు ఉపక్రమించాలి. ఉదయాన్నే సూర్యోదయం చూడాలి. వ్యాయామాన్ని కూడా దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలి. యోగ, ధ్యానం వంటివి అలవర్చుకోవడమే కాకుండా ఖాళీ సమయాలలో, సెలవులలో కుటుంబంతో టైం స్పెండ్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. అంతేకాదు నచ్చిన ప్రదేశాలకు, దేవాలయాలకు వెళ్లడం వల్ల కాస్త వరకు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇకపోతే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న యువతలో 67% మంది ఇలా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా జెన్ జీలోని 72 శాతం మంది యువత అనుభవ పూర్వక వెల్ నెస్ ను కోరుకుంటున్నారు. అంతేకాదు ఉద్యోగుల ఒత్తిడి తగ్గించడానికి మనదేశంలో కూడా దాదాపు 43% సంస్థలలో ఈ వెల్నెస్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం గమనించదగ్గ విషయం.
ఇకపోతే ఇలాంటి చర్యలు తీసుకుంటూనే.. ఉద్యోగ జీవితంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి.. శీతల పానీయాలు, ఫాస్ట్ ఫుడ్లను దూరం పెట్టాలి. ఆకుకూరలు, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. తరచూ మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి12, విటమిన్ డి ఉండేలా చూసుకోవాలి. రోజుకు ఆరు లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. ఇలా కొన్ని పద్ధతులు పాటించినట్లయితే.. ఈ బర్నవుట్ సిండ్రోమ్ నుండి బయటపడవచ్చు. ఏది ఏమైనా ఎక్కువగా ఐటీ ఉద్యోగులే ఈ సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి కాస్త ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని కూడా నిపుణులు సలహాలు ఇస్తూ ఉండడం గమనార్హం.