కవిత ఓవరాక్షన్ ?

కల్వకుంట్ల కవిత ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. అచ్చంగా గురివింద గింజలాగే వ్యవహరిస్తున్నారు.;

Update: 2023-09-14 06:30 GMT

కల్వకుంట్ల కవిత ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. అచ్చంగా గురివింద గింజలాగే వ్యవహరిస్తున్నారు. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లపై మీ వైఖరి ఏమిటని సోనియాగాంధి, రాహుల్ గాంధీలను నిలదీశారు. రిజర్వేషన్లపై వైఖరి చెప్పిన తర్వాతే సోనియా, రాహుల్ హైదరాబాద్ లోకి అడుగుపెట్టాలని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ను జనాలు ఎప్పటికీ నమ్మరని కవిత చెప్పారు. రాహుల్ గాంధి అవుట్ డేటెడ్ పొలిటీషియన్ గా కవిత ఎద్దేవా చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

మిగిలిన పార్టీలన్నీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కవిత పదేపదే డిమాండ్ చేస్తున్నారు. మహిళలకు చట్టసభల్లో ఇవ్వాల్సినన్ని సీట్లు ఎందుకు ఇవ్వటంలేదని డిమాండ్ చేయటమే చాలా ఆశ్చర్యంగా ఉంది. మహిళలకు చట్టసభల్లో ఇవ్వాల్సినన్ని టికెట్లు ఎందుకు ఇవ్వటంలేదో చెప్పాలని ఇతర పార్టీలను డిమాండ్ చేస్తున్న కవిత బీఆర్ఎస్ లో ఎన్నిసీట్లు ఇచ్చారో చెప్పగలరా ? మొన్ననే కేసీయార్ ప్రకటించిన అభ్యర్ధుల్లో ఎంతమంది మహిళలకు టికెట్లిచ్చారో కవితకు తెలుసా ?

కవిత డిమాండ్ చేసినట్లుగా 33 శాతం మహిళలకు టికెట్లు ఇవ్వాలంటే 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 39 సీట్లివ్వాలి. కానీ కేసీయార్ ఇచ్చిన సీట్లెన్ని ? కేవలం 7 అంటే ఏడు మాత్రమే. మరి ఇవ్వాల్సిన సీట్లకు ఇచ్చిన సీట్లకు ఏమన్నా పొంతునందా ? 39 సీట్లు ఎందుకు ఇవ్వలేదని తన తండ్రి కేసీయార్ ను కవిత ఎందుకు డిమాండ్ చేయలేదు. మహిళా రిజర్వేషన్లు ముందు తమ సొంతపార్టీతోనే కవిత మొదలుపెట్టవచ్చు కదా ?

బీఆర్ఎస్ అంటే కవిత కుటుంబపార్టీగానే లెక్క. తమ కుటుంబపార్టీలో రిజర్వేషన్లు అమలుచేయించలేని కవిత ఇదే విషయమై ఇతర పార్టీలను డిమాండ్లు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. పైగా ఈ విషయమై స్పష్టమైన వైఖరి చెప్పిన తర్వాతే సోనియా, రాహుల్ తెలంగాణాలోకి అడుగుపెట్టాలని డిమాండ్ చేయటం చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఇక్కడే కవితలోని గురివిందగింజ సామెతను అందరు గుర్తుచేసుకుంటున్నారు. కాబట్టి ఇతరులను డిమాండ్ చేసేముందు తాను ఆచరించి చూపాలని కవిత తెలుసుకుంటే మంచిది.

Tags:    

Similar News