లిల్లీఫుట్ కామెంట్స్ లొల్లి.. బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్ ఖాయం?
గులాబీ పార్టీ బీఆర్ఎస్ లో ఇంటి పోరు ముదురుతోంది..! ఆడబిడ్డ కల్వకుంట్ల కవితపై చర్యలు తప్పవని అనిపిస్తోంది.;
గులాబీ పార్టీ బీఆర్ఎస్ లో ఇంటి పోరు ముదురుతోంది..! ఆడబిడ్డ కల్వకుంట్ల కవితపై చర్యలు తప్పవని అనిపిస్తోంది. మూడు నెలల కిందట మొదలైన విభేదాలు చినికిచినికి గాలివానగా మారి చివరకు బహిష్కరణ వేటు వేసే వరకు వెళ్లేలా మారాయి. పార్టీ పరిస్థితిపై, బీజేపీతో సంబంధాలపై తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ లీక్ కావడం ఇక్కడివరకు తెచ్చింది. తన తండ్రికి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే ఎవరూ మాట్లాడలేదని, పార్టీలో మరో నాయకుడికి ఇస్తే మాత్రం చాలామంది గొంతు విప్పారని కవిత పరోక్షంగా తన అన్న కేటీఆర్‌ను టార్గెట్ చేశారు. తర్వాత పరిస్థితులు కాస్త సద్దుమణిగినా.. ఇటీవల కవిత కీలక పాత్ర పోషించే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బాధ్యతలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు అప్పగించారు కేటీఆర్. దీంతోనే కవితపై పార్టీ గుర్రుగా ఉన్నట్లు స్పష్టమైంది.
నాపై పెద్ద నాయకుడి కుట్ర...
తాజాగా తనపై పార్టీలో పెద్ద నాయకుడు కుట్ర చేస్తున్నారంటూ కవిత ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో పార్టీ ఓటమికి కారణమైన లిల్లీపుట్ నాయకుడు కూడా తన గురించి మాట్లాడతారా? అసలు కేసీఆర్ లేకుంటే ఆ నాయకుడు ఎక్కడ? అని ప్రశ్నించారు. తండ్రికి రాసిన లేఖను లీక్ చేసింది ఎవరు? అని అసలు విభేదాలకు కారణమైన అంశంపై మరోసారి నోరు విప్పారు.
వేరు దారి
కవిత వ్యవహార శైలి చూస్తుంటే ఆమెతో బీఆర్ఎస్ తెగదెంపులు చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే కవిత.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమ బాట పడుతున్నారు. తాజాగా నల్లగొండ బీఆర్ఎస్ నాయకుడు లిల్లీపుట్ లీడర్ అని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యల అనంతరం నల్లగొండకు చెందిన మాజీ మంత్రి, కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తుడు అయిన జగదీశ్వర్ రెడ్డి అలర్ట్ అయ్యారు. ఎర్రవల్లి ఫాంహౌస్లో కేసీఆర్ తో భేటీ అయ్యారు.
ఇక వేటు ఖాయమే...
కవిత చేసిన తీవ్ర విమర్శల నేపథ్యంలో కేసీఆర్‌తో జగదీశ్‌రెడ్డి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇప్పటికే తండ్రి కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. అందుకే కవితపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందా..? అనే చర్చ జరుగుతోంది. కాగా, ఫామ్‌హౌస్ లో తండ్రితో సమావేశం అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్ కు బయల్దేరారు. అందుకే బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందని చర్చ తీవ్రంగా సాగుతోంది.