బీజేపీతో బీఆర్ఎస్ ములాఖత్... పెద్ద బండ వేసిన కవిత !
బీఆర్ఎస్ భారీ ఓటమి తరువాత ఎన్నడూ లేనంతగా రాజకీయ ఇబ్బందులో కూరుకుని పోయి ఉంది. ఒక ఉద్యమ పార్టీగా 2014 వరకూ బీఆర్ఎస్ ఉంది. అప్పట్లో బిగ్ ఫిగర్ గా కేసీఆర్ మాత్రమే ఉండేవారు.;
బీఆర్ఎస్ భారీ ఓటమి తరువాత ఎన్నడూ లేనంతగా రాజకీయ ఇబ్బందులో కూరుకుని పోయి ఉంది. ఒక ఉద్యమ పార్టీగా 2014 వరకూ బీఆర్ఎస్ ఉంది. అప్పట్లో బిగ్ ఫిగర్ గా కేసీఆర్ మాత్రమే ఉండేవారు. కానీ పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో మరో రెండు అధికార కేంద్రాలు ఆవిర్భవించాయి. వారే కేటీఆర్ హరీష్ రావు. వీరికి తోడు అన్నట్లుగా కవిత కూడా ఉన్నారు.
దీంతో బీఆ రెస్ లో మూడు ముక్కలాట స్టార్ట్ అయింది అని ఆ పార్టీ ఓటమి తర్వాత నుంచి విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. మరో వైపు చూస్తే కేసీఆర్ గతంలో మాదిరిగా చురుకుగా లేరు. ఆయన పార్టీ ఓటమి తరువాత గత ఏడాదిన్నరగా పెద్దగా జనంలోకి వచ్చింది లేదు. బాధ్యతలు అన్నీ కేటీఆర్ మీద పెట్టేశారు అని అంటారు. ఇక చూస్తే కేసీఆర్ ఏడు పదులు దాటి ఉన్నారు. వయోభారంతో పాటు మునుపటి కంటే ఆయన రాజకీయ ఆసక్తులను తగ్గించుకుని కేటీఆర్ కోసమే అన్నట్లుగా ఉన్నారని చెబుతున్నారు.
దీంతోనే బీఆర్ఎస్ లో అంతర్గతంగా ఘర్షణలు చెలరేగుతున్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే కాంగ్రెస్ బలంగా ఉంది. అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి వంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా సీఎం గా ఉన్నారు. దాంతో ఆయన ధాటిని తట్టుకోవడం బీఆర్ఎస్ కి కష్టంగా ఉంది. తెలంగాణా రాజకీయాల్లో చూస్తే బీజేపీ కూడా మెల్లగా బలపడుతోంది. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేనలతో కలసి ఎన్డీయే కూటమిగా బరిలోకి దిగితే గట్టి పోటీ తప్పదని విశ్లేషణలు ఉన్నాయి.
అదే సమయంలో ఈ త్రిముఖ పోరులో కాంగ్రెస్ కి మళ్ళీ అధికారం దక్కినా దక్కవచ్చు అన్నది మరో విశ్లేషణ గా ఉంది. ఏ విధంగా చూసుకున్నా బీఆర్ఎస్ కి రాజకీయ దారి రహదారి కాదు అన్నదే అర్థం అవుతోంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో కేసీఆర్ రాజకీయ వైఖరి మీద కూడా అనుమానాలు రేకెత్తించేలా కాంగ్రెస్ పెద్దలు తరచూ ఆరోపణలు చేస్తూ ఉంటారు. బీజేపీతో బీఆర్ఎస్ మిలాఖత్ అయింది అన్నది వారి ప్రధాన ఆరోపణ.
ఆ మధ్యన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీకి దిగితే బీఆర్ఎస్ కనీసం అభ్యర్ధులను పెట్టలేదు. దీనినే కాంగ్రె వారు ఎత్తి చూపారు. వాటికి బీఆర్ఎస్ నుంచి గట్టిగా తిప్పికొట్టి సమాధానం ఇచ్చుకోలేని పరిస్థితి ఉంది అని అంటున్నారు. కాంగ్రెస్ బీజేపీల రెండింటి విషయం తీసుకుంటే సమదూరం పాటించాల్సిన బీఆర్ఎస్ బీజేపీ మీద కొంత సాఫ్ట్ కార్నర్ తో ఉందా అన్నది కూడా చర్చగా ఉంది.
ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలలో సైతం బీజేపీ మీద పెద్దగా కేసీఆర్ విమర్శలు చేయకపోవడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పు పట్టారు. సరిగ్గా ఈ పాయింట్లనే బీఆర్ఎస్ లో కీలక నేత స్వయంగా కేసీఅర్ కుమార్తె అయిన కవిత ఎత్తి చూపడం అంటే బీఆర్ఎస్ కి ఇది మింగుడుపడని పరిణామమే అని అంటున్నారు. బయట నుంచి కాంగ్రెస్ నేతలు విమర్శించడం వేరు. పార్టీలో ఉంటూ వస్తున్న కవిత కేసీఆర్ సొంత కుమార్తె ఈ అనుమానాలు వ్యక్తం చేస్తూ నిలదీయడం వేరు.
దాంతో ఇపుడు బీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతోంది. బీజేపీతో బీఆర్ఎస్ మిలాఖత్ అంటే కచ్చితంగా అది బీఆర్ఎస్ ఫ్యూచర్ మీదనే దెబ్బ తీసేలా ఉంటుందని అంటున్నారు. కవిత వెళ్ళబుచ్చిన అనుమానాలతో జనాల్లోకి ఇది మరింత బలంగా వెళ్లే ప్రమాదం ఉంది అని అంటున్నారు. అదే కనుక జరిగితే బీజేపీకి తెలంగాణాలో రాజకీయంగా స్కోప్ మరింతగా పెరుగుతుంది. ఆ లెక్కన బీఆర్ఎస్ తగ్గిపోయే సీన్ ఉంటుంది అని అంటున్నారు.
పైగా సెక్యులర్ పార్టీగా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ చెదిరి కాంగ్రెస్ వైపు పోలరైజ్ అయినా అవుతుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కవిత తండ్రికి రాసిన ఒకే ఒక లేఖలో అతి పెద్ద బండనే వేశారు అని అంటున్నారు. ఇది బీఆర్ఎస్ రాజకీయ వైఖరిని అయోమయంలో పడేసేలా ఉంది అని అంటున్నారు. చూడాలి మరి దీనికి బీఆర్ఎస్ నుంచి ఏ తరహా జవాబు వస్తుందో. ఇక జవాబుని మాటలలో వ్యక్తం చేయడం కాదు రేపటి కార్యాచరణ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటేనే జనాలు నమ్ముతారని అంటున్నారు.