బీఆర్ఎస్ పేరులోనే దోషం ఉందా? మళ్లీ పేరు మార్చే చాన్స్ కనిపిస్తోందా?
జూబ్లీహిల్స్ పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వరుస పరాజయాలు పార్టీ కేడర్ ను నిరాశకు గురిచేస్తున్నాయి.;
జూబ్లీహిల్స్ పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వరుస పరాజయాలు పార్టీ కేడర్ ను నిరాశకు గురిచేస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంటు తగ్గిపోవడం, పార్టీ పేరులో తెలంగాణకు చోటు లేకపోవడమే ఎదురుదెబ్బలకు కారణంగా విశ్లేషిస్తున్నారు. పార్టీ పేరులో తెలంగాణ తొలగించి భారతీయ రాష్ట్ర సమితిగా మార్చడంతోనే ఈ దుస్థితి వచ్చిందని కూడా అంటున్నారు. గత ఎన్నికల ముందు బీఆర్ఎస్ గా పేరు మార్చడం వల్లే అధికారం చేజారిందని, మళ్లీ ఏ ఎన్నికల్లోనూ గెలవలేకపోవడానికి ‘తెలంగాణ’ సెంటిమెంటు దూరం కావడమే అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో పార్టీ పేరులో మళ్లీ పేరు మార్చితే బాగుటుందనే సూచనలు వస్తున్నాయి. ఇదేసమయంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందని.. ఇక వీఆర్ఎస్ తీసుకోవడమే మిగిలివుందని రాజకీయ ప్రత్యర్థులు సెటైర్లు కూడా వేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పేరుపైనే ప్రస్తుతం ఎక్కువ చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే ఆశయంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్నే పునాదిగా చేసుకుని తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని పెట్టిన ఉద్యమ నేత కేసీఆర్.. పార్టీ పేరు మార్చి చాలా తప్పు చేశారని విశ్లేషిస్తున్నారు.
2023 ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి - టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చారు. తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చాలనే ఆలోచనతో ఈ మార్పు చేశారు కేసీఆర్. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి కారణమైన తాను దేశంలో కీలకనేతగా చక్రం తిప్పుతానని భావనతో కేసీఆర్ తన పార్టీకి జాతీయ స్థాయి గుర్తింపు తేడానికి చాలా ప్రయత్నాలు చేశారు.
పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీతోపాటు ఒడిశా, ఛత్తీస్ గడ్ తోపాటు దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తానని ప్రకటించారు. అంతేకాకుండా దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు ఇచ్చారు. తన నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారన్న ఆలోచనకు వచ్చిన కేసీఆర్.. పార్టీ పేరులో తెలంగాణ ఉంటే దేశ ప్రజలకు దగ్గరయ్యే పరిస్థితి ఉండదని భావించి తెలంగాణకు బదులుగా భారత్ పేరును తీసుకువచ్చారు.
అయితే ఇలా భారతీయ రాష్ట్ర సమితిగా మారిన తెలంగాణ రాష్ట్రసమితి సొంత రాష్ట్రంలో తీరని నష్టాన్ని చవిచూడాల్సివచ్చింది. దేశంపై పెత్తనం చెలాయించాలనే ఆశలు అడియాశలు కాగా, చేతిలో ఉన్న అధికారం కోల్పోవాల్సివచ్చింది. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేకపోవడంతో కేడర్ లో అంతర్మథనం సాగుతోంది. పార్టీ పేరు మార్చిన నుంచి విజయాలు ముఖం చాటేస్తున్నాయని, మళ్లీ పార్టీ పేరు మార్చితే కానీ మంచిరోజులు వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ అధిష్టానంలో తర్జనభర్జన సాగుతోందని అంటున్నారు. పార్టీ పేరు మళ్లీ మార్చితే ప్రజల్లో ఇంకా చులకనయ్యే అవకాశం ఉందని గులాబీ పెద్దలు భయపడుతున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ విషయంపై తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సలహాలు కూడా అందుతున్నట్లు చెబుతున్నారు.