బ్రిటిష్ ఎయిర్‌వేస్ భయం: డబ్బులు పోయాయి, ఫ్లైట్ మిస్సయ్యింది
శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి లండన్‌కు వెళ్లే బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానాన్ని బుక్ చేసుకున్న ఒక ప్రయాణికుడికి ఎదురైన నిస్సహాయమైన అనుభవం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది;
శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి లండన్‌కు వెళ్లే బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానాన్ని బుక్ చేసుకున్న ఒక ప్రయాణికుడికి ఎదురైన నిస్సహాయమైన అనుభవం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. మే 31న బయలుదేరాల్సిన తన ఫ్లైట్‌ను ఒక రోజు ముందుకు మార్చాలని ప్రయత్నించగా, ప్రయాణికుడికి డబ్బులు పోవడం, ఫ్లైట్ మిస్సవడం, మానసిక ప్రశాంతత కరువవడం వంటి దురదృష్టకర పరిణామాలు ఎదురయ్యాయి.
-ఏం జరిగిందంటే?
ప్రయాణికుడు చెప్పిన వివరాల ప్రకారం, బ్రిటిష్ ఎయిర్‌వేస్ వెబ్‌సైట్‌లో తన ఫ్లైట్‌ను మే 30వ తేదీకి మార్చాలని ప్రయత్నించాడు. చేంజ్ ఫీజుగా £150 చెల్లించేందుకు కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి, ఆథరైజ్ చేయగానే, సిస్టమ్ క్రాష్ అయింది. ఈ మార్పుకు సంబంధించి అతనికి ఎటువంటి మెయిల్ రాలేదు, వెబ్‌సైట్‌లో కూడా ఎటువంటి కన్ఫర్మేషన్ కనిపించలేదు.ఈ దశలో, ఫ్లైట్ మార్పు జరగలేదని భావించిన ప్రయాణికుడు, తన అసలు ప్రణాళిక ప్రకారమే మే 31న ప్రయాణించేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఆ రాత్రి చెక్-ఇన్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు అసలు షాకింగ్ విషయం బయటపడింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ అతడిని ఇప్పటికే మే 30 ఫ్లైట్‌కు మార్చేసింది! అంతేకాకుండా, మార్పు ఫీజు £150 కూడా అతని కార్డ్ నుంచి తీసుకుంది.
-సహాయం కోరితే నిరాశే
ఈ అనూహ్య పరిణామంతో ప్రయాణికుడు తన ఫ్లైట్‌ను మిస్ అయ్యాడు. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌ను సంప్రదించినప్పుడు, వారు అతని తప్పుగానే భావించి, కొత్త టికెట్ కొనేందుకు మళ్లీ డబ్బులు కట్టాలని వాదించారు. సిస్టమ్ ఎర్రర్‌కు స్క్రీన్‌షాట్ చూపించలేకపోయాడనే కారణంతో, బ్రిటిష్ ఎయిర్‌వేస్ బృందం ఎటువంటి సహాయం చేయలేమంటూ చేతులు దులిపేసింది.
-నెటిజన్ల మండిపాటు
ఈ వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రయాణికుడి చెప్పిన విషయాలు నిజమైతే, బ్రిటిష్ ఎయిర్‌వేస్ స్పష్టంగా తప్పు చేసింది. చెల్లింపులపై రశీదు ఇవ్వడం, ఫ్లైట్ మారినట్లు మెయిల్ లేదా మెసేజ్ ద్వారా ప్రయాణికుడికి సమాచారం ఇవ్వడం ఎయిర్‌లైన్ బాధ్యత అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, అంతర్జాతీయ విమానాల్లో ఈ రకమైన సాంకేతిక లోపాలు తరచుగా జరుగుతున్నా, ఇలాంటి నిర్లక్ష్యం వలన ప్రయాణికులు మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-చట్టపరంగా వెళ్లే అవకాశం
ప్రస్తుతం ఈ ప్రయాణికుడు లీగల్ యాక్షన్ వైపు మొగ్గు చూపే పరిస్థితికి వచ్చారు. ఈ ఘటన ఇతర ప్రయాణికులకు కూడా హెచ్చరికగా నిలవాలి. పెద్ద ఎయిర్‌లైన్స్ అయిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ నుంచి ఇటువంటి నిర్లక్ష్యం నిజంగా శోచనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన ఎయిర్‌లైన్స్ తమ సాంకేతిక వ్యవస్థలను మెరుగుపరచుకోవాల్సిన అవసరాన్ని, అలాగే కస్టమర్ సేవల్లో పారదర్శకతను పాటించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది.